భారత్-EU ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. చౌకగా మారనున్న బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడీ కార్ల రేట్లు..

భారత్-EU ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. చౌకగా మారనున్న బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడీ కార్ల రేట్లు..

యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ భారీగా సుంకాలను తగ్గించనున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో లగ్జరీ కార్లు కొనే భారతీయులకు భారీగా తగ్గనున్న రేట్లు శుభవార్త అని చెప్పుకోవచ్చు. జనవరి 27, 2026న ప్రకటించనున్న 'ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్'(FTA) ద్వారా మెర్సిడెస్ బెంచ్, బీఎండబ్ల్యూ, ఆడి, రెనాల్ట్, ఫోక్స్ వ్యాగన్ వంటి బ్రాండెడ్ కార్ల ధరలు భారీ మెుత్తంలో తగ్గనున్నాయి.

ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ గరిష్టంగా 110 శాతం వరకు పన్నులు విధిస్తోంది. అయితే యూరోపియన్ యూనియన్ తో తాజా ఒప్పందం ప్రకారం ఈ పన్నును నేరుగా 40 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంటే పన్ను భారం సగానికి పైగా తగ్గనుంది. ప్రాథమికంగా 15వేల యూరోలు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.16.3 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లకు ఈ మినహాయింపు లభించనుంది. రాబోయే కాలంలో ఈ పన్నును 10 శాతానికి కూడా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఇది మారుతున్న ప్రజల జీవనశైలికి అనుకూలంగా ఉన్నందున ఈ లగ్జరీ కార్లకు డిమాండ్ రానున్న కాలంలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఏడాదికి సుమారు 2 లక్షల వాహనాల దిగుమతికి మాత్రమే ఈ తక్కువ పన్ను వర్తిస్తుందట. ఇది పెట్రోల్, డీజిల్ కార్ల దిగుమతికి అందించిన వార్షిక పరిమితి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే.. దేశీయ తయారీదారులైన టాటా, మహీంద్రా ప్రయోజనాలను కాపాడేందుకు.. మొదటి ఐదేళ్ల వరకు ఎలక్ట్రిక్ కార్లపై పన్ను తగ్గింపు ఉండదని భారత్ తేల్చేసింది. ఆ తర్వాతే వీటికి రాయితీలు లభిస్తాయి. మెుత్తానికి పన్ను తగ్గింపు నిర్ణయం వల్ల మెర్సిడెస్, ఆడి, వోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ధరలు కొన్ని లక్షల రూపాయల మేర తగ్గే అవకాశం ఉంది.

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం భారత్ పర్యటనలో ఉన్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ ఒప్పందం వల్ల భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి కార్లు అందుబాటు ధరలోకి రావడమే కాకుండా.. విదేశీ కంపెనీలు మన దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. కేవలం ఆటోమొబైల్ రంగమే కాకుండా రక్షణ, వస్త్ర రంగాల్లో కూడా భారత్‌కు ఈ ఒప్పందం ద్వారా సానుకూల ప్రయోజనాలు దక్కనున్నాయి.