మునీర్.. నీ జుజూబీ మాటలకు భయపడం.. మా జోలికొస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడం: భారత్

మునీర్.. నీ జుజూబీ మాటలకు భయపడం.. మా జోలికొస్తే ఎలాంటి చర్యలకైనా వెనకాడం: భారత్

న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న పాక్​ఆర్మీ చీఫ్​ ఆసిమ్ ​మునీర్​ చేసిన అణు బెదిరింపులను భారత్​ తీవ్రంగా ఖండించింది. అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్​ తన అసలు రూపం చూపిస్తున్నదని మండిపడింది. సోమవారం ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్​  అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని మండిపడింది. మునీర్‌‌ వ్యాఖ్యలు అత్యంత బాధ్యాతారాహిత్యంగా ఉన్నాయని పేర్కొన్నది. స్నేహపూర్వక మూడో దేశం(అమెరికా) గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నది. ఇది ప్రాంతీయ భద్రతను మాత్రమే కాదు.. అంతర్జాతీయ భద్రతలను పాక్‌‌ ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తుందో తెలియజేస్తోందని పేర్కొంది.

న్యూక్లియర్ బ్లాక్‌‌ మెయిల్‌‌కు భయపడం

పాకిస్తాన్​చేసే న్యూక్లియర్​ బ్లాక్​మెయిల్‌‌కు భారత్​భయపడబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని తేల్చిచెప్పింది. కాగా, అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా మునీర్​వ్యాఖ్యలపై స్పందించాయి.  పాక్‌‌ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నదని మండిపడ్డాయి.

 అక్కడ (పాకిస్తాన్​) ప్రజాస్వామ్యం లేదని దీన్ని బట్టి చూస్తే తెలుస్తున్నదని, ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తున్నట్టు తెలిసిపోతున్నదని పేర్కొన్నాయి. పాక్‌‌ వద్ద ఉన్న అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం నిజంగానే ఉన్నదని, అదే జరిగితే   ప్రపంచం మొత్తానికి ముప్పేనని తెలిపాయి. 

ఆసిమ్​ మునీర్​ ఏమన్నాడంటే..

అమెరికా పర్యటనలో ఉన్న పాక్​ఆర్మీ చీఫ్​ఆసిమ్​మునీర్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయని, భారత్​ నుంచి ముప్పు ఎదురైతే న్యూక్లియర్ వార్‌‌‌‌కు దిగుతామని హెచ్చరించారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అక్కడి పాక్‌‌ పౌరులను ఉద్దేశించి మునీర్ మాట్లాడారు. 

‘‘సింధూ నదిపై భారత్ డ్యామ్‌‌లు నిర్మించే వరకు మేం వెయిట్​ చేస్తం. మా వద్ద న్యూక్లియర్​ మిసైల్స్​ఉన్నయ్. వారు కట్టే డ్యామ్‌‌లను 10 మిసైల్స్‎తో పేల్చేస్తాం. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో భారత్​నుంచి మా అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. అణుయుద్ధానికి దిగుతాం. మేం నాశనమై పోతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’’ అంటూ కామెంట్స్​​ చేశారు.

బీఎల్​ఏను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న పాకిస్తాన్​లోని బలూచిస్తాన్​ లిబరేషన్​ ఆర్మీ (బీఎల్​ఏ)ని ఫారిన్​​ టెర్రరిస్ట్​ ఆర్గనైజేషన్​గా అమెరికా ప్రకటించింది. బీఎల్​ఏలో భాగమైన మజీద్​ బ్రిగేడ్​ను కూడా ఉగ్రవాద గ్రూప్​గా పేర్కొంది.