
- టాపార్డర్ బ్యాటర్లపై ఫోకస్
- మ. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
విశాఖపట్నం:
సొంతగడ్డపై విమెన్స్ వరల్డ్ కప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోష్ మీదున్న హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని ఆతిథ్య జట్టు అదే జోరుతో గురువారం వైజాగ్ స్టేడియంలో జరిగే పోరులో సౌతాఫ్రికా పని పట్టాలని చూస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక, గత పోరులో పాకిస్తాన్‌పై గెలిచినప్పటికీ జట్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి.
ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు తమ తడబాటును వీడాల్సి ఉంది. లంక, పాక్‌తో పోలిస్తే సఫారీ టీమ్ బలంగా ఉండటంతో ఏ తప్పిదం చేసినా.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్‌లో ముందుండి నడిపిస్తే జట్టు వరుసగా మూడో విజయం సొంతం చేసుకోగలదు.
స్టార్టు హిట్టయితేనే..
మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, ఈ విజయాల వెనుక జట్టును ఒక పెద్ద ఆందోళన వెంటాడుతోంది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ వంటి కీలక ప్లేయర్లు నుంచి రన్స్ రాకపోవడం కలవరపెడుతోంది. శ్రీలంక, పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లలో ఈ ముగ్గురూ ఫెయిలవడంతో జట్టును ఆదుకునే భారం హర్లీన్ డియోల్‌తో పాటు అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మతో కూడిన మిడిలార్డర్ బ్యాటర్లపై పడింది.
శ్రీలంకపై 124 రన్స్‌కే 6 వికెట్లు, పాకిస్తాన్‌పై 159 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి ఇండియా కష్టాల్లో పడింది. ఆ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పోరాడకపోయి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. సౌతాఫ్రికా వంటి బలమైన జట్టుపై మళ్లీ ఇదే పునరావృతమైతే ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే స్టార్ బ్యాటర్లు సత్తా చాటాల్సిందే.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఫలితం తేడా వస్తే, పాయింట్ల పట్టికలో ఇండియా కిందకు జారడమే కాకుండా ఈ నెల 12న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు ముందు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్తుంది. అయితే, స్టార్ బ్యాటర్లు ఫెయిలైనప్పటికీ గత మ్యాచ్‌లు గెలవడం జట్టు బలాన్ని చూపిస్తోంది. కానీ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్స్‌ను ఓడించాలంటే మన జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇండియా బౌలర్లు మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆరు వికెట్లతో టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా ఉంది.
ఆమెకు తోడుగా స్పిన్నర్లు స్నేహ్ రాణా, శ్రీ చరణి, పేసర్ క్రాంతి గౌడ్ సత్తా చాటుతున్నారు. అయితే, గువాహతి, కొలంబో మాదిరిగా వైజాగ్ పిచ్ స్పిన్‌కు అంతగా సహకరించకపోవచ్చు. ఈ నేపథ్యంలో క్రాంతి గౌడ్‌కుతోడుగా సీనియర్ పేసర్ రేణుకా సింగ్ కొత్త బాల్‌తో మెప్పించాల్సి ఉంటుంది. ఇక, గత మ్యాచ్‌కు అనారోగ్యంతో దూరమైన పేస్-బౌలింగ్ ఆల్-రౌండర్ అమన్‌జోత్ కౌర్ పూర్తిగా కోలుకుంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది.
సఫారీలతో ఈజీ కాదు
ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో 69 కే ఆలౌటై ఘోర పరాజయం పాలైన సౌతాఫ్రికా ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది. బలమైన న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ లారా వోల్‌వర్ట్, సీనియర్ ప్లేయర్ మరిజేన్ కాప్, అనెకే బాష్ కూడా ఇండియాపై రాణించాలని చూస్తున్నారు. ఎమ్‌లాబా, అయబోంగా ఖకా, కాప్, మసబటా క్లాస్, క్లో ట్రయాన్‌లతో కూడిన సఫారీ బౌలింగ్ కూడా ఇండియా బ్యాటర్లకు కఠిన పరీక్ష పెట్టనుంది. కాబట్టి సౌతాఫ్రినాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు.
పిచ్/వాతావరణం
ఈ మ్యాచ్ కోసం వైజాగ్‌లో బ్యాటింగ్ వికెట్‌ను రెడీ చేశారు. కొంత స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. బుధవారం చిన్నపాటి వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం వరకూ వర్ష సూచన ఉంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్/రేణుకా ఠాకూర్, స్నేహ్ రాణా, శ్రీచరణి, క్రాంతి గౌడ్.
సౌతాఫ్రికా:లారా వోల్‌వర్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మరిజేన్ కాప్, అనికే బాష్/ డెర్క్‌సెన్, సినలో జాఫ్తా (కీపర్), క్లో టయాన్, నదైన్ డి క్లర్క్, మసబటా క్లాస్, అయబోంగ ఖకా, ఎమ్‌లాబా.