ఇండియా గోల్డ్ లోన్ మార్కెట్కు... ఆకాశమే హద్దు.. 2026లో రూ. 15 లక్షల కోట్లకు చేరుకునే చాన్స్

ఇండియా గోల్డ్ లోన్ మార్కెట్కు... ఆకాశమే హద్దు.. 2026లో రూ. 15 లక్షల కోట్లకు చేరుకునే చాన్స్

న్యూఢిల్లీ: మనదేశ ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్​ రాకెట్​ స్పీడ్​తో దూసుకెళ్తోంది. ఇది​ 2026 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. గతంలో అంచనా వేసిన దానికంటే ఇది ఒక సంవత్సరం ముందుగానే ఈ మైలురాయిని చేరుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. దీని రిపోర్ట్​ప్రకారం.. బ్యాంకులు ఈ రంగంలో ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. 

నాన్-–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్​బీఎఫ్​సీల) కంటే వేగంగా ఎదుగుతున్నాయి. పెద్ద ఎత్తున లోన్లను ఇస్తున్నాయి.  గోల్డ్​ మార్కెట్​ 2027 మార్చి నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని సెప్టెంబర్​ 2024లో ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత అంచనా వేగంగా పెరిగింది. ఈ మార్కెట్​ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 18 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఏజెన్సీ భావిస్తోంది.

ఇవీ కారణాలు 

బంగారం ధరలు నిలకడగా పెరగడం, కొత్త గరిష్ట స్థాయిలకు చేరుకోవడం ఈ రంగంలో ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధికి దారితీసింది. దీంతో తమ అంచనాలను ఇక్రా సవరించింది. బ్యాంకులు గోల్డ్​ లోన్లపై మరింత ఫోకస్​ చేస్తున్నాయి. ఎన్​బీఎఫ్​సీల కంటే ఎక్కువ సంఖ్యలో అప్పులను ఇస్తున్నాయి. గంటల్లో లోన్​ మొత్తాన్ని కస్టమర్​ ఖాతాకు పంపుతున్నాయి. 2025 మార్చి నాటికి మొత్తం ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో బ్యాంకుల మార్కెట్​ వాటాను 82 శాతానికి పెరిగింది. 

2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య బ్యాంకు గోల్డ్ లోన్​ ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) విలువ సుమారు 26 శాతం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్​)తో పెరిగింది. ఇదే కాలంలో ఎన్​బీఎఫ్​సీలు 20 శాతం వృద్ధి మాత్రమే సాధించగలిగాయి. 2025 మార్చి నాటికి మొత్తం గోల్డ్ లోన్ ఏయూఎం రూ. 11.8 లక్షల కోట్లుగా ఉంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య సుమారు 26 శాతం సీఏజీఆర్​తో విస్తరించింది.

పెరిగిన గోల్డ్​లోన్లు

బ్యాంకులు తమ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో వ్యూహాత్మక మార్పులు చేశాయి. రిటైల్ పర్సనల్ గోల్డ్ లోన్ల వాటా అంతకుముందు 11 శాతం ఉండగా, 2025 మార్చి నాటికి 18 శాతానికి పెరిగింది. గోల్డ్ జ్యువెలరీ లోన్ల వల్ల వ్యవసాయం, ఇతర రుణాల వాటా 70 శాతం నుంచి 63 శాతానికి తగ్గింది. బంగారం ధరలు పెరగడం, అన్సెక్యూర్డ్​ లోన్  ప్రొడక్ట్స్​ వృద్ధి తక్కువగా ఉండటం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఎన్​బీఎఫ్​సీ గోల్డ్ లోన్ ఏయూఎం 30 నుంచి 35 శాతం వరకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. 

ఎన్​బీఎఫ్​సీల గోల్డ్ లోన్ ఏయూఎం 2025 జూన్ నాటికి రూ. 2.4 లక్షల కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే 41 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్​లో  కొన్ని కంపెనీలే దూకుడుగా ఉన్నాయి. 2025 మార్చి నాటికి టాప్–4   సంస్థలకు  గోల్డ్ లోన్లలో 81 శాతం వాటా ఉంటుందని ఐక్రా సీనియర్ వైస్– ప్రెసిడెంట్ ఏఎం కార్తీక్​ తెలిపారు.