V6 News

U19 Asia Cup: సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా హైయెస్ట్ స్కోర్

U19 Asia Cup: సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా హైయెస్ట్ స్కోర్

అండర్-19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్ లోనే టీమిండియా చెలరేగి ఆడుతోంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లోనే ఏకంగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. శుక్రవారం (డిసెంబర్ 12) దుబాయ్ వేదికగా యూఏఈపై మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 14 సిక్సులు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. సూర్యవంశీ 171 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. 

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా 433 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డ్ బంగ్లాదేశ్ ఖాతాలో ఉంది. 2012లో బంగ్లాదేశ్ అండర్-19 జట్టు ఖాతర్ పై 7 వికెట్ల నష్టానికి 363 పరుగు చేసింది. 13 ఏళ్ళ తర్వాత ఈ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే అండర్-19 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా 480 పరుగులతో టాప్ లో ఉంది. 2002 లో కెన్యపై ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది. 14 ఏళ్ల చిచ్చర పిడుగు.. వైభవ్ సూర్యవంశీ యూఏఈ బౌలర్లపై తాండవం ఆడాడు. 56 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లతో సెంచరీ చేసి.. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. సెంచరీ చేశాక మరింత దూకుడుగా ఆడాడు. 

ఓవరాల్ గా 95 బంతుల్లో 14 సిక్సులు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీకి 29 పరుగుల దూరంలో ఔటయ్యాడు. సూర్యవంశీ ఔట్ కావడంతో యూఏఈ బౌలర్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే ఆయుష్ మాత్రే (4) వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఆరోన్ జార్జ్ తో కలిసి సూర్య 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్య 171 పరుగుల  మారథాన్ ఇన్నింగ్స్ తర్వాత ఔటైనా.. విహాన్ మల్హోత్రా (69), వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ కుండు (32), కనిష్క్ చౌహాన్ (28) దూకుడుగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు.