చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు సిద్ధం: బిపిన్ రావత్

చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు సిద్ధం: బిపిన్ రావత్

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరుగుతున్న చర్చలు విఫలమైతే డ్రాగన్ దురాక్రమణలను తిప్పికొట్టడానికి సైనిక చర్యలకు దిగుతామని చీఫ్​ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఈ విషయంపై సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్నాయి. ‘లడఖ్‌లో చైనా ఆర్మీ అతిక్రమణను ఎదుర్కోవడానికి సైనిక చర్యలకు దిగే అవకాశం ఉంది. కానీ మిలటరీ, డిప్లొమాటిక్ లెవల్ చర్చలు విఫలమైతేనే దీన్ని ఆప్షన్‌గా భావిస్తాం’ అని రావత్ చెప్పారు. గత రెండు–మూడు నెలలుగా ఇరు వైపుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ఐదుగురు లెఫ్టినెంట్‌ జనరల్ లెవల్ చర్చలు కూడా ఉండటం గమనార్హం. కానీ ఇవన్నీ విఫలమయ్యాయి. ఫింగర్ ఏరియా నుంచి తన ఆర్మీని వెనక్కి తీసుకోవడానికి చైనా నిరాకరిస్తోందని సమాచారం.

ఏప్రిత్–మే నుంచి ఫింగర్ ఏరియా, గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్‌, కొంగ్రుంగ్ నాలా లాంటి ప్రాంతాల్లో చైనా ఆర్మీ అతిక్రమణకు దిగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది తీవ్రరూపం దాల్చింది. అయితే సైనిక పరమైన చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సైన్యాలను వెనక్కి పంపాయి. కానీ లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ వెంబడి సుమారు లక్ష సైన్యాన్ని చైనా మోహరించిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూడా సరిహద్దు వద్ద భద్రతా దళాలను మోహరించింది.