IND vs ENG 2025: తొలి సెషన్ మనదే.. ఇంగ్లాండ్‌కు వికెట్ ఇవ్వని జైశ్వాల్, రాహుల్

IND vs ENG 2025: తొలి సెషన్ మనదే.. ఇంగ్లాండ్‌కు వికెట్ ఇవ్వని జైశ్వాల్, రాహుల్

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. బుధవారం (జూలై 23) ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి రోజు తొలి సెషన్ లో టీమిండియా ఆధిపత్యం చూపించింది. ఓపెనర్ రాహుల్, జైశ్వాల్ పట్టుదలగా ఆడడంతో తొలి రోజు లంచ్ సమయానికి 26 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. రాహుల్ (40), జైశ్వాల్ (36) క్రీజ్ లో ఉన్నారు. ఈ సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు ఎంతలా శ్రమించినా టీమిండియా వికెట్  తీయలేకపోయారు. 

ఆచితూచి ఆడిన రాహుల్, జైశ్వాల్:

తొలి రోజు పిచ్ సీమర్లకు అనూకూలంగా ఉందని భావించిన స్టోక్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఈ సిరీస్ లో వరుసగా నాలుగో సారి టాస్ ఓడిపోయిన గిల్ సేన బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ ఇద్దరూ కూడా ఆచితూచి ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇద్దరూ కూడా ఎలాంటి అనవసర షాట్స్ ఆడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఒక ఎండ్ లో రాహుల్ పర్వాలేదనిపించినా.. మరో ఎండ్ లో జైస్వాల్ పూర్తిగా డిఫెన్సివ్ కే పరిమితమయ్యాడు. దీంతో పరుగుల వేగం తగ్గింది. 

తొలి 10 ఓవర్లలో 27 పరుగులే రాబట్టిన టీమిండియా.. తర్వాత 10 ఓవర్లలో మరో 27 పరుగులు చేసింది. లంచ్ కు ముందు మన ఓపెనర్లు జాగ్రత్తగా ఆడడంతో ఈ సెషన్ ను వికెట్ లేకుండానే ముగించింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో షోయబ్ బషీర్ స్థానంలో ఆల్ రౌండర్ లియాన్ డాసన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇండియా ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్.. గాయపడిన ఆకాష్ దీప్ స్థానంలో అనుషూల్ కంబోజ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నారు.