
- ఇరాక్, సౌదీ కంటే ఎక్కువ
న్యూఢిల్లీ: తక్కువ ధరకు వస్తుండటంతో మనదేశం రష్యా నుంచి విపరీతంగా ముడిచమురును కొంటోంది. ఫిబ్రవరిలో ఆ దేశం నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రికార్డుస్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. మనకు ఎక్కువగా చమురును అమ్మే ఇరాక్, సౌదీ అరేబియా నుంచి వచ్చే దిగుమతుల కంటే రష్యా నుంచి కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా ప్రకారం, భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ రష్యా నుంచే సరఫరా అవుతోంది. వరుసగా ఐదవ నెలలోనూ ఏకైక అతిపెద్ద సరఫరాదారుగా రష్యా కొనసాగింది. 2022 ఫిబ్రవరిలో రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రష్యా నుంచి భారతదేశానికి చమురు దిగుమతులు ఒక శాతం కంటే తక్కువగా ఉండేవి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశ దిగుమతులలో రష్యా వాటా 35 శాతానికి పెరిగింది. రోజుకు 1.62 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు వస్తోంది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముడిచమురు కొనుగోలుదారు ఇండియా. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న మాస్కోను శిక్షించేందుకు యూరప్, అమెరికా సహా పలుదేశాలు ఆంక్షలు విధించాయి. చమురు అమ్మకానికీ పరిమితులు విధించాయి. దీంతో రష్యా డిస్కౌంట్ ధరకు మనకుచమురును అమ్ముతోంది. సౌదీ నుంచి చమురు దిగుమతులు నెలవారీగా 16 శాతం తగ్గగా, అమెరికా నుంచి 38 శాతం తగ్గాయి. వోర్టెక్సా ప్రకారం, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి కొనే చమురు కంటే రష్యా చమురు కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు- - దశాబ్దాలుగా భారతదేశానికి ప్రధాన చమురు సరఫరాదారులు.
తగ్గిన ఇతర దేశాల సప్లయ్‌లు
భారతదేశానికి అతిపెద్ద చమురు సప్లయర్ అయిన ఇరాక్, ఫిబ్రవరిలో రోజుకు 9,39,921 బ్యారెల్స్ చమురును సరఫరా చేయగా, సౌదీ 6,47,813 బ్యారెల్స్‌ను సరఫరా చేసింది. యూఏఈ, అమెరికాను అధిగమించి 4,04,570 బీపీడీ (బ్యారెల్స్ పెర్ డే)ల సరఫరాతో నాలుగో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. అమెరికా జనవరిలో 2,48,430 బీపీడీని సరఫరా చేసింది. జనవరిలో 3,99,914 బీడీపీలను సప్లయ్ చేసింది. ఇరాక్ , సౌదీ సరఫరాలు 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. చవకైన రష్యా క్రూడ్‌ను ప్రాసెస్ చేయడం ద్వారా భారతీయ రిఫైనర్లకు ఎంతో మేలు జరుగుతోందని వోర్టెక్సా ఆసియా–-పసిఫిక్ ఎనాలసిస్ హెడ్ సెరెనా హువాంగ్ అన్నారు. తక్కువ ధరకు దొరుకుతున్నంతకాలం రష్యన్ బ్యారెల్స్ కోసం రిఫైనర్లు ఎగబడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. పోయిన డిసెంబరులో, యూరోపియన్ దేశాలు రష్యన్ చమురును నిషేధించాయి. ఒకవేళ కొన్నా బ్యారెల్‌కు 60 డాలర్లకు మించి చెల్లించకూడదని స్పష్టం చేశాయి. భారతీయ రిఫైనర్లు 60 డాలర్లకంటే తక్కువ ధరతోనే రష్యా నుంచి చమురును కొంటున్నారు. ఇందుకు యూఏఈ కరెన్సీ దిర్హమ్‌ను వాడుతున్నారు.