
ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ బ్యాటర్ రహమత్ షా చూపించిన పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తీవ్ర గాయంతో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిన రహమత్ షా.. గాయం వేధిస్తున్న జట్టు కోసం మళ్ళీ గ్రౌండ్ లోకి బ్యాటింగ్ చేయడానికి వచ్చి తన డెడికేషన్ చూపించాడు. శనివారం (అక్టోబర్ 11) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రహమత్ షా కాలికి తీవ్ర గాయం కావడం కావడంతో బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. దీంతో గ్రౌండ్ వదిలి రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళిపోయాడు.
జట్టు 9 వ వికెట్ కోల్పోయినప్పుడు రహమత్ షా తన పట్టుదలను చూపించాడు. తన నొప్పిని పక్కనపెట్టి జట్టు కోసం బ్యాటింగ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ ఆఫ్ఘన్ బ్యాటర్ ఒక బంతి మాత్రమే అడగలిగాడు. ఆ తర్వాత క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో వీల్‌చైర్‌లో గ్రౌండ్ నుండి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. రహమత్ వీల్‌చైర్‌లో మైదానం నుంచి బయటకు వెళ్తున్న క్లిప్‌ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ఎక్స్ (X)లో పోస్ట్ చేసింది. " దేశం కోసం తన శరీరాన్ని త్యాగం చేసిన రహమత్ షా తన డెడికేషన్ చూపించాడు. అతను నడవలేకపోయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు". అని ఏసీబీ తమ ప్లేయర్ గురించి గొప్పగా పోస్ట్ చేసింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఏకపక్షంగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ పై 81 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 44.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఒక్కడే పోరాడాడు. 95 పరుగులు చేసి జట్టు స్కోర్ లో సగానికి పైగా రన్స్ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మీరాజ్ మూడు వికెట్లతో రాణించాడు. 191 పరుగుల ఛేజింగ్ లో బంగ్లాదేశ్ కేవలం 28.3 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Rahmat Shah reminded us what heroes are made of 🙌#AFGvBAN pic.twitter.com/Rn4ZVemS9Y
— FanCode (@FanCode) October 11, 2025