
మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మహిళలు బ్యాటింగ్ లో చెలరేగి ఆడారు. ఆదివారం (అక్టోబర్ 12) విశాఖ పట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాట్ కు పని చెప్పి భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లు స్మృతి మందాన (66 బంతుల్లో 80), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75) చెలరేగడంతో 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయ్యారు. 80 పరుగులు చేసిన మందాన టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సదర్లాండ్ 5 వికెట్లు పడగొట్టింది. సోఫీ మోలినెక్స్ మూడు వికెట్లు తీసుకోగా.. గార్డనర్, స్కట్చ్ లకు తలో వికెట్ లభించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మందాన, ప్రతీక రావల్ తొలి వికెట్ కు ఏకంగా 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోర్ కు బాటలు వేశారు. తొలి 10 ఓవర్ల పాటు ఆచితూచి ఆడిన మన ఓపెనర్లు ఆ తర్వాత జోరు పెంచారు. ఒక ఎండ్ లో మందాన ధాటిగా ఆడితే మరో ఎండ్ లో రావల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి సహకారాన్ని అందించింది. ఈ క్రమంలో మొదట స్మృతి, ఆ తర్వాత రావల్ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. క్రీజ్ లో ఉన్నంత సేపు వేగంగా ఆడిన మందాన 66 బంతుల్లోనే 80 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించింది.
తొలి వికెట్ కు 155 పరుగులు జోడించిన తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించిన ఈ టీమిండియా ఓపెనర్ డీప్ మిడ్ వికెట్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కాసేపటికే ఫైన్ లెగ్ లో క్యాచ్ ఇచ్చి రావల్ (75) కూడా పెవిలియన్ దారి పట్టింది. డియోల్ ఒక చక్కని ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 22 పరుగులు చేసి నిరాశపరించింది. మిడిల్ ఆర్డర్ లో రోడ్రిగ్స్ (33), రిచా ఘోష్ (32) కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా పరుగులు రాబట్టారు. చివర్లో ఆసీస్ బౌలర్లు చక చక వికెట్లు తీయడంతో ఇండియా 330 పరుగులకు ఆలౌటైంది.