
మేడారం జాతర అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారని అనుకోవటం లేదని అన్నారు. తనపై ఫిర్యాదు చేయటానికి ఏముంటుందని అన్నారు. సోమవారం (అక్టోబర్ 13) మేడారం సందర్శించిన మంత్రులు పొంగులేటి, సీతక్క.. జాతర అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2026 మహా జాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్, SPతో సహా ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి పొంగులేటి.. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదన్నారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రూ. 211 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క సారక్క లాగ పనిచేస్తున్నారని కొనియాడారు.
►ALSO READ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తొలిరోజు 10 నామినేషన్లు.. ఏ ఏ పార్టీల అభ్యర్థులు దాఖలు చేశారంటే..
భక్తుల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని అన్నారు. రాతి కట్టడాలకు కావల్సిన గ్రానైట్ పొరుగు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నట్లు చెప్పారు. శాశ్వత ప్రతిపాదకన పనులు చేస్తున్నామని అన్నారు.
ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. గత జాతరకు కోటిమంది భక్తులు హాజరయ్యారని.. ఈసారి భక్తుల సంఖ్య డబుల్ అవుతుందని అంచనాలు వేస్తున్నట్లు తెలిపారు.