IND vs WI 2nd Test: చివరి రోజే ఫలితం: విజయానికి 58 పరుగుల దూరంలో ఇండియా.. చేతిలో 9 వికెట్లు

IND vs WI 2nd Test: చివరి రోజే ఫలితం: విజయానికి 58 పరుగుల దూరంలో ఇండియా.. చేతిలో 9 వికెట్లు

ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఫలితం ఐదో రోజే రానుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో నాలుగో రోజు టీమిండియా విజయానికి 121 పరుగులు అవసరం కాగా.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) ఉన్నారు. ఇండియా గెలవాలంటే చివరి రోజు 58 పరుగులు చేయాలి. మరోవైపు వెస్టిండీస్ విజయానికి 9 వికెట్లు అవసరం. ఈ టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖాయంగా మారింది. ఐదో రోజు తొలి సెషన్ లో మ్యాచ్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నాలుగో రోజు రెండో సెషన్ లో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించిన గ్రేవీస్, సీల్స్ జోడి చివరి వికెట్ కు 79 పరుగులు నెలకొల్పడంతో భారత జట్టు విజయం ఆలస్యం అయింది. ఈ జోడీ కారణంగా మ్యాచ్ ఐదో రోజుకి వెళ్ళింది. చివరి సెషన్ లో ఎట్టకేలకు బుమ్రా చివరి వికెట్ తీసి విండీస్ కథ ముగించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చింది. 121 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ జైశ్వాల్ (8) వికెట్ ను కోల్పోయింది. రెండో ఓవర్లో వారికన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించినా జైశ్వాల్ లాంగన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో రాహుల్, సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.

►ALSO READ | IPL 2026 mini-auction: ధోనీ, గైక్వాడ్, ఫ్లెమింగ్ మీటింగ్.. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ వీరే
 
రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ నాలుగో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.  కాంప్‌బెల్, హోప్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. తొలి సెషన్ లో వెస్టిండీస్ 79 పరుగులు రాబట్టి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 252 పరుగులతో నాలుగో రోజు రెండో సెషన్ ప్రారంభించిన వెస్టిండీస్ 66 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది. లంచ్ తర్వాత సెంచరీ చేసుకున్న హోప్ ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో విండీస్ పతనం మొదలైంది. 

ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు తన స్పిన్ మ్యాజిక్ తో టెవిన్ ఇమ్లాచ్, ఛేజ్, ఖారీ పియరీలను స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. బుమ్రా టైలండర్ల పని పట్టాడు. వారికన్ కు బౌల్డ్ చేసిన బుమ్రా..ఇదే ఊపులో ఆండర్సన్ ఫిలిప్ ను పెవిలియన్ కు పంపాడు. బుమ్రా చివరి వికెట్ తీసుకొని విండీస్ ఇన్నింగ్స్ ను ముగించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.