
ముంబై: వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను ఓకొరత వేధిస్తున్నదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. నాణ్యమైన మరో పేసర్ అందుబాటులో ఉంటే బాగుండేదన్నాడు. ‘ఇండియా జట్టు కు మరో పేస్ బౌలర్ అవసరం చాలా ఉంది. నాణ్యమైన పేసర్ అందుబాటులో ఉంటే బుమ్రా, షమీ, భువనేశ్వర్ కు మరింత సాయంగా ఉండేది. ఇప్పటికే జట్టు లో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు హార్దిక్ , విజయ్‌శంకర్ ఉన్నారని వాదించొచ్చు. కానీ ఈ వాదనతో నేను ఏకీభవించను. వీళ్లిద్దరి వల్ల తుది జట్టు కూర్పు దెబ్బతినొచ్చు. పేస్ బౌలర్ అందుబాటులో ఉంటే కూర్పులో అనేక ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి వస్తాయి’ అని గౌతీ వ్యాఖ్యానించాడు.
ప్రస్తుత వరల్డ్ కప్ ఫార్మాట్ వల్ల అసలు సిసలైన చాంపియన్ వెలుగులోకి వస్తుందన్నాడు. ‘ఈ ఫార్మాట్ ప్రకారం ఒక జట్టు అన్ని జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది.కాబట్టి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అసలైన చాంపియన్ ఎవరనేది ఈ ఫార్మాట్ తేలుస్తుంది. భవిష్యత్ వరల్డ్ కప్ లలో ఐసీసీ ఇదే ఫార్మాట్ ను కొనసాగిస్తే బాగుంటుంది. ఈ మెగా ఈవెంట్ లోఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , న్యూజిలాండ్ ఆటను కచ్చితంగా చూసి తీరాలి . బౌలింగ్ ఆల్‌రౌండర్లతో ఆసీస్ బలంగా ఉంది. కివీస్ , ఇంగ్లండ్ లను కూడా తక్కువగా అంచనా వేయలేం ’ అని ఈ మాజీ ఓపెనర్ పేర్కొన్నాడు.