దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తే.. డాక్ట‌ర్ల రక్ష‌ణ‌, పేషెంట్ల ట్రీట్మెంట్ ఎలా..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తే.. డాక్ట‌ర్ల రక్ష‌ణ‌, పేషెంట్ల ట్రీట్మెంట్ ఎలా..

క‌రోనాపై యుద్ధం: రోజుకు ల‌క్ష N95 మాస్కుల త‌యారీ.. ఇంకా..

క‌రోనా మ‌హ‌మ్మారిపై తొలి ద‌శ‌లోనే అప్ర‌మ‌త్త‌మైన భార‌త ప్ర‌భుత్వం.. ఈ వైర‌స్ ను దేశం నుంచి త‌రిమికొట్టేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటోంది. క‌రోనా బారిన‌ప‌డిన‌ వారికి చికిత్స అందిస్తూనే.. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. దేశ ప్ర‌జ‌లంతా ఎక్క‌డి వారు అక్క‌డే త‌మ ఇళ్ల‌లో ఉండ‌డం ద్వారా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోక‌కుండా అడ్డుక‌ట్ట వేయాల‌ని పిలుపునిచ్చింది. ఇలా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటూనే.. ఏవైనా అనుకోని ప‌రిస్థితులు త‌లెత్తితే ఎదుర్కొనేందుకు కూడా సిద్ధ‌మంవుతోంది. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు వైర‌స్ సోకితే అవ‌స‌ర‌మ‌య్యే వైద్య సౌక‌ర్యాల‌పై దృష్టి పెట్టింది కేంద్ర ప్ర‌భుత్వం. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తే.. పేషెంట్ల‌కు, వారికి చికిత్స చేసే డాక్ట‌ర్ల‌కు అవ‌స‌ర‌మైన రెస్పిరేట‌రీ మాస్కులు, ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ జాకెట్స్ లాంటి రక్ష‌ణ ప‌రిక‌రాలు, వ్యాధి సోకిన వారి ప‌రిస్థితి విష‌మిస్తే అవ‌స‌ర‌మ్యే వెంటిలేట‌ర్స్ వంటివి ల‌క్ష‌ల సంఖ్య‌లో రెడీ చేస్తోంది.

డాక్ట‌ర్ల ర‌క్ష‌ణ‌…

మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తే.. ముందుగా ఆలోచించాల్సింది డాక్ట‌ర్ల సేఫ్టీ గురించి.. ఆ త‌ర్వాత పేషెంట్ల ప్రాణాల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం. డాక్ట‌ర్లు ఆరోగ్యంగా ఉంటే.. వ్యాధి బారిన‌ప‌డిన వారిని ర‌క్షించ‌గ‌లుగుతారు. అందుకోస‌మే ప్ర‌భుత్వం ఊహించ‌ని ప‌రిస్థితులు త‌లెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మ‌హ‌మ్మారిపై యుద్ధమే ప్ర‌క‌టించిన తీరులో రంగంలోకి దిగి.. డాక్ట‌ర్లు, పేషెంట్ల‌కు అస‌వ‌ర‌మ‌య్యే ఎక్యూప్మెంట్ స‌మ‌కూరుస్తోంది. ఇందులో భాగంగా దేశంలో రెండు కంపెనీల‌కు N95 రెస్పిరేట‌రీ మాస్కుల త‌యారీ బాధ్య‌త అప్ప‌గించింది. ఆ సంస్థ‌లు ఇప్ప‌టికే రోజుకు 50 వేల మాస్కులు త‌యారు చేస్తున్నారు. వ‌చ్చే వారానిక‌ల్లా.. రోజుకు ల‌క్ష మాస్కులు త‌యారు చేయ‌గ‌లుగుతాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా ఆస్ప‌త్రుల్లో 11.95 ల‌క్ష‌ల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయ‌ని, మ‌రో 5 ల‌క్ష‌ల స్టాక్ గ‌డిచిన రెండ్రోజుల్లో స‌ప్లై చేయగా.. సోమ‌వారం ల‌క్షా 40 వేల మాస్కులు పంపిన‌ట్లు తెలిపింది. అలాగే డీఆర్డీవో సంస్థ కూడా రోజుకు 20 వేల చొప్పున N-99 మాస్కులను త‌యారు చేస్తోంద‌ని వెల్ల‌డించింది.

21 ల‌క్ష‌ల పీపీఈల‌కు ఆర్డ‌ర్

డాక్ట‌ర్లకు వైర‌స్ సోక‌కుండా శ‌రీర‌మంతా క‌వ‌ర్ చేసేలా ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ (పీపీఈ) ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 3.34 ల‌క్ష‌లు అందుబాటులో ఉన్న‌ట్లు చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. రెడ్ క్రాస్ సంస్థ ఇండియాకి 10 వేల పీపీఈల‌ను డొనేట్ చేసింద‌ని, అవి ఈ రోజు కేంద్రానికి అందుతాయ‌ని చెప్పింది. కొన్ని విదేశాలు మ‌న‌కు విరాళంగా 3 ల‌క్ష‌ల పీపీఈల‌ను పంపాయ‌ని, అవి ఏప్రిల్ 4 నాటికి వ‌స్తాయ‌ని తెలిపింది. అలాగే మ‌న దేశంలోని 11 కంపెనీల‌కు 21 ల‌క్ష‌ల పీపీఈలు త‌యారు చేయాల్సిందిగా ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఆ సంస్థ‌లు రోజుకు 7 వేల వ‌ర‌కు సిద్ధం చేసి.. ప్ర‌భుత్వానికి అంద‌చేస్తున్నాయ‌ని చెప్పింది. ఇది ఏప్రిల్ రెండో వారం చివ‌రికి రోజుకు 15 వేల పీపీఈలను స‌ప్లై చేస్తాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవాళ మ‌రో కంపెనీకి 5 ల‌క్ష‌ల పీపీఈల త‌యారీకి ఆఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు పేర్కొంది. వీటికి అద‌నంగా సింగ‌పూర్ కు చెందిన ఓ కంపెనీ నుంచి మ‌రో 10 ల‌క్ష‌ల పీపీఈలు కొనుగోలు చేసేందుకు విదేశాంగ శాఖ ద్వారా ఆర్డ‌ర్ పెడుతున్న‌ట్లు వివ‌రించింది.

పేషెంట్ల ప‌రిస్థితి విష‌మిస్తే…

క‌రోనా వైర‌స్ పేషెంట్ల ఊపిరితిత్తుల‌పై దాడి చేస్తుంది. ఊపిరి తిర‌గ‌కుండా చేసి చివ‌ర‌కు ప్రాణం పోతుంది. అయితే ప్ర‌స్తుతం కేవ‌లం రెండు నుంచి నాలుగు శాతం పేషెంట్ల‌కు మాత్ర‌మే వెంటిలేట‌ర్ పై చికిత్స అందించాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇప్ప‌డు మ‌న దేశంలో కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి ఒకే. కానీ, అనుకోని ప‌రిస్థితులు త‌లెత్తితే భారీ సంఖ్య‌లో క్రిటిక‌ల్ పేషెంట్ల‌కు చికిత్స అందించాల్సి వ‌చ్చినా ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. నోయిడాకు చెందిన అగ్వా హెల్త్ కేర్ సంస్థ‌కు 10 వేల వెంటిలేటర్లు త‌యారు చేయాల‌ని ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్ రెండు వారం నాటి క‌ల్లా ఇవి ప్ర‌భుత్వానికి అందే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే మ‌రో 30 వేల వెంటిలేట‌ర్లు సిద్ధం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ను కోరిన‌ట్లు చెప్పింది. వాటి త‌యారీ సంస్థ‌ల‌తో క‌లిసి రెండు నెల‌ల్లోగా వాటిని అందుబాటులోకి తేవాలని సూచించిన‌ట్లు పేర్కొంది. కొన్ని ఆటోమొబైల్ కంపెనీల‌ను కూడా వెంటిలేట‌ర్లు త‌యారు చేయాల‌ని అడిగిన‌ట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌.