
వాషింగ్టన్: టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలతో ఆటలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీతులు వల్లించాడు. ఇటీవల ఇండియాపై విషం చిమ్ముతున్న ట్రంప్.. భారత్ సుంకాల పేరుతో అమెరికాను చంపేస్తోందంటూ తాజాగా మరోసారి ఇండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ప్రపంచంలోనే అత్యంత సుంకాలు విధించే దేశం ఇండియా అని మళ్లీ అవే పాత ఆరోపణలు చేశారు. అందుకే ఇండియాపై 50 శాతం సుంకాలు విధించానని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు ట్రంప్. సుంకాలను తాను అర్ధం చేసుకున్నంతగా ప్రపంచంలో మరేవరూ అర్ధం చేసుకోలేరని తనకు తానే డప్పు కొట్టుకున్నారు.
స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోలో మాట్లాడిన ట్రంప్ ఇండియా-అమెరికా వాణిజ్య సంబంధాలపై హాట్ కామెంట్స్ చేశారు. ‘‘చైనా, బ్రెజిల్ లాగే ఇండియా కూడా సుంకాలతో అమెరికాను చంపుతుంది. సుంకాలను నేను వారి కంటే బాగా అర్ధం చేసుకున్నా. ప్రపంచంలో ఎవరూ నా కంటే బాగా టారిఫ్‌లను అర్ధం చేసుకోలేరు. ఇండియా ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశం. అమెరికాపై అధిక సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నా.
ఇందులో భాగంగానే ఇండియాపై 50 శాతం టారిఫ్‌లు విధించా. ఈ సుంకాలతో భారత్ దిగొచ్చింది. అమెరికా దిగుమతులపై సుంకాలను పూర్తిగా తొలగించడానికి భారత్ ముందుకొచ్చింది. భారత దిగుమతులపై నేను టారిఫ్‌లు విధించకపోతే ఇండియా ఈ ఆఫర్ అస్సలు ఇచ్చేది కాదు. ప్రతీకార సుంకాలు విధించాలనే నిర్ణయం అమెరికాకు అద్భుతమైన చర్చల శక్తిని ఇస్తుంది’’ అని అన్నారు ట్రంప్.
కాగా, భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అమెరికా ఎగుమతులపై సుంకాలకు ప్రతీకారంగా ఇండియాపై 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదాడు. దీంతో భారత్‌పై మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకున్నాయి. ట్రంప్ ఇండియాపై ఏకపక్షంగా 50 శాతం సుంకాలు విధించడంతో అమెరికా, భారత్ మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇండియాపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కడంతో ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.