
- ఎలక్ట్రిక్ ట్రక్కులకు బూస్ట్..పీఎం ఈ-డ్రైవ్ కింద ఇన్సెంటివ్స్
- రూ. 9.6 లక్షల వరకు చెల్లింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం ఈ–డ్రైవ్స్కీమ్లో భాగంగా ప్రతి ఎలక్ట్రిక్ ట్రక్కుకు రూ. 9.6 లక్షల వరకు ఇన్సెంటివ్స్ఇచ్చే పథకాన్ని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం ప్రారంభించారు. పీఎం ఈ–డ్రైవ్ కోసం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించగా, రూ.500 కోట్లను ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం ఇస్తారు. ఓడరేవులు, లాజిస్టిక్స్, సిమెంట్ స్టీల్ వంటి పరిశ్రమలు ఈ స్కీము వల్ల లాభపడతాయని, మొత్తం 5,600 వరకు ఎలక్ట్రిక్ ట్రక్కులకు ఇన్సెంటివ్స్దక్కుతాయని మంత్రి చెప్పారు.
"మొత్తం బండ్లలో డీజిల్ ట్రక్కులు మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఇవి గాలి కాలుష్యాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ పథకం, ఎలక్ట్రిక్ ట్రక్కులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది” అని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖల మంత్రి కుమారస్వామి అన్నారు. ఈ ప్రయత్నం స్థానికీకరణను ప్రోత్సహిస్తుందని, రవాణా ఖర్చును తగ్గిస్తుందని, ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు.
‘‘ఈ–-ట్రక్కులకు ప్రోత్సాహకాలు పొందడానికి పాత కాలుష్య కారక ట్రక్కులను తొలగించడం తప్పనిసరి. ప్రోత్సాహకం ఎలక్ట్రిక్ ట్రక్కు స్థూల వాహన బరువుపై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ. 9.6 లక్షలు వరకు రాయితీలు పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాలను కొనుగోలు ధరలో ముందస్తు తగ్గింపుగా అందిస్తారు.
పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్ ద్వారా ఆటో కంపెనీలకు (ఓఈఎంలు) మొదట వచ్చిన వారికి మొదటగా అందించే ప్రాతిపదికన స్కీమ్అమలవుతుంది’’ అని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద బెంగళూరుకు 4,500 బస్సులు, ఢిల్లీకి 2,800 బస్సులు, హైదరాబాద్‌కు రెండు వేల బస్సులు, అహ్మదాబాద్‌కు వెయ్యి బస్సులు, సూరత్‌కు 600 బస్సులను ఇచ్చారు.