
అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం సంపాదించింది. నరేంద్ర మోడీ స్టేడియంలో ముగిసిన రెండో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఓపెనర్ రాహుల్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో దుమ్ములేపడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో జడేజా (104), వాషింగ్ టన్ సుందర్ (9) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖారీ పియరీ, వారికన్, సీల్స్ తలో వికెట్ తీసుకున్నారు.
4 వికెట్ల నష్టానికి 326 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన టీమిండియా ఈ సెషన్ లో 116 పరుగులు రాబట్టి జురెల్ వికెట్ మాత్రమే కోల్పోయింది. రెండో సెషన్ లో క్రీజ్ లో సెటిల్ అయిన వీరిద్దరూ మూడో సెషన్ లోనూ జోరు కొనసాగించారు. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదర్కొంటూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో జురెల్ తన టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్ కు వీరిద్దరూ 206 పరుగులు జోడించిన తర్వాత జురెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపట్లో రోజు ముగుస్తుందనగా జడేజా కూడా 168 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. సుందర్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. రోజంతా కష్టపడినా విండీస్ బౌలర్లకు మూడు సెషన్ లలో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు.
The runs keep flowing for India as they steadily extend their lead on Day 2 of the first #INDvWI Test 💪#WTC27 📝: https://t.co/0CCdk4QFPN pic.twitter.com/dAx4HQWCUf
— ICC (@ICC) October 3, 2025
జురెల్, జడేజా హాఫ్ సెంచరీలు:
3 వికెట్ల నష్టానికి 218 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్పిన్నర్ వారికన్ బౌలింగ్ లో రాహుల్ స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో టీమిండియాను ముందుకు తీసుకెళ్లే బాధ్యత జురెల్, జడేజా తీసుకున్నారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఐదో వికెట్ కు అజేయంగా 108 పరుగులు నెలకొల్పారు. ఈ క్రమంలో జురెల్, జడేజా ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవరాల్ గా ఈ సెషన్ లో ఇండియా 108 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.
రాహుల్ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ:
రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా ఇన్నింగ్స్ ను కెప్టెన్ గిల్, రాహుల్ ముందుకు తీసుకెళ్లారు. తొలి అరగంట జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. తొలి గంట ముగిసిన తర్వాత గిల్, రాహుల్ జోరు పెంచారు. బౌండరీలు కొడుతూ స్కోర్ కార్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో గిల్ 94 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 50 కొట్టిన వెంటనే రివర్స్ స్వీప్ చేసే క్రమంలో గిల్ స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో రాహుల్, గిల్ మధ్య 98 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.
గిల్ ఔటైన తర్వాత వికెట్ కీపర్ జురెల్ తో కలిసి రాహుల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛేజ్ బౌలింగ్ లో సింగిల్ తీసుకొని తన 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. లంచ్ కు వరకు జురెల్, రాహుల్ వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 30 పరుగులు జోడించారు. ఈ సెషన్ లో టీమిండియా 29 ఓవర్లు ఆడి 97 పరుగులు చేసి గిల్ వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్లలో ఛేజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సీల్స్ కు ఒక వికెట్ దక్కింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌట్ అయింది