
టీమిండియా ఆల్ రౌండర్ వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అక్షర్ ప్లేయింగ్ 11 లో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియా పిచ్ లు.. స్పిన్ తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం ఉండడంతో అక్షర్ కు తుది జట్టులో ఖచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశించారు. అయితే అక్షర్ పటేల్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కింది.
అహ్మదాబాద్ లోని పిచ్ గ్రీన్ వికెట్. సహజంగా గ్రీన్ వికెట్ అంటే ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ కారణంగానే తుది జట్టులో అక్షర్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు నితీష్ మూడో సీమర్ గా జట్టులో కొనసాగనున్నాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లతో ఇండియా బరిలోకి దిగింది. జడేజా సీనియర్ ప్లేయర్ కాగా ఇటీవలే వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎవరినీ జట్టులో తప్పించలేని పరిస్థితి.
అక్షర్ పటేల్ టెస్ట్ కెరీర్ ను పరిశీలిస్తే అతనికి అద్భుతమైన గణాంకాలు ఉన్నాయి. ఇప్పటివరకు 14 టెస్ట్ మ్యాచ్ ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటాడు. 22 ఇన్నింగ్స్ లో 35 యావరేజ్ తో 646 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లోయర్ ఆర్డర్ లో కీలకమైన రన్స్ చేస్తూ చాలాసార్లు జట్టును ఆదుకున్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే అత్యద్భుతమైన గణాంకాలు అతని సొంతం. 27 ఇన్నింగ్స్ ల్లో 19 యావరేజ్ తో 55 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 5 సార్లు 5 వికెట్ల ఘనత సాధించడం విశేషం.
భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):
టాగెనరైన్ చంద్రపాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్(కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, జోహన్ లేన్, జేడెన్ సీల్స్