ఈ ఏడాది'సాధారణం కంటే తక్కువ వర్షపాతం': స్కైమెట్

ఈ ఏడాది'సాధారణం కంటే తక్కువ వర్షపాతం': స్కైమెట్

ఎల్ నినో ప్రభావంతో 2023లో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఆసియాలో ఎల్-నినో సంభావ్యత పెరుగుతూ వస్తోందని.. ఇది రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా 868.6 మిల్లీమీటర్లు మేర నమోదవుతాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఈ రుతుపవనాల వర్షాలు ధీర్ఘకాలిక సగటులో 94 శాతం అంటే సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని స్కైమెట్  తెలిపింది.

భారతదేశంపై ఎల్ నినో ప్రభావం

ఎల్ నినో తీవ్రతను బట్టి వాతావరణంపై ప్రభావం మారవచ్చు. ఇది భారతదేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపించవచ్చు. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో ఇది కరువు పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వ్యవసాయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. దేశంలోని సగం మేరకు వ్యవసాయ భూములు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వానాలపైనే ఆధారపడతాయి.

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర భారత వ్యవసాయ గిన్నెగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లలో  సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలు ఇప్పటికే భారతదేశంలోని సారవంతమైన ఉత్తర, మధ్య, పశ్చిమ మైదానాలలో పండిన, శీతాకాలంలో పండించిన గోధుమ వంటి పంటలను దెబ్బతీశాయి. దీని వల్ల వేలాది మంది రైతులు నష్టాలకు గురయ్యారు.