మన భవిష్యత్​ భేష్​! అసోచామ్​ ప్రకటన

మన భవిష్యత్​ భేష్​! అసోచామ్​ ప్రకటన

న్యూఢిల్లీ: బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో మనదేశం 2024లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగే అవకాశం ఉందని అసోచామ్​ ప్రకటించింది. రైల్వేలు  విమానయానం సహా నిర్మాణం, ఆతిథ్యం  మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో డిమాండ్​ ఊపందుకుందని గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  జులై–-సెప్టెంబరు క్వార్టర్​లో తయారీ రంగంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరిగింది. జీడీపీ ఊహించిన దానికంటే వేగంగా 7.6 శాతం వృద్ధి చెందడంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది.  

ఆర్​బీఐ అంచనా వేసిన 6.5 శాతం జీడీపీ వృద్ధి అంచనాలను అధిగమించింది. ఏకంగా 7.6 శాతం వృద్ధి సాధ్యమైంది. గత ఏడాది ఇదే క్వార్టర్​లో వృద్ధి 6.2 శాతం,  అంతకుముందు క్వార్టర్​లో 7.8 శాతం వృద్ధి నమోదయింది. భారతదేశ జీడీపీ వృద్ధి జూలై–-సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైనా  వృద్ధి 4.9 శాతాన్ని అధిగమించింది. ‘‘పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు అధిక-వడ్డీ రేట్లు,  ఇంధన ధరల కారణంగా నలిగిపోతున్నాయి. ఏడు శాతం వృద్ధిని బట్టి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. స్థూల ఆర్థిక వ్యవస్థ బాగుంది. వృద్ధికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి” అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. 

కొత్త ఏడాదిలో మరింత ప్రగతి

నిర్మాణం, హోటళ్లు, ఏవియేషన్, ఆటోమొబైల్,  ఎలక్ట్రానిక్స్ వంటి ఇతర తయారీ రంగాలు రాబోయే సంవత్సరంలో మరింత మెరుగైన పనితీరును కనబరుస్తాయని సూద్​ అభిప్రాయపడ్డారు. ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం,  ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నిర్మాణం వంటి రంగాల్లో అనేక అనుబంధ పరిశ్రమలు ఉన్నాయని, అవి కూడా ఊపందుకున్నాయని చెప్పారు. వీటిలో స్టీల్, సిమెంట్, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి, కన్జూమర్​ డ్యూరబుల్స్ ముఖ్యమైనవని అసోచామ్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్థూల ఆర్థిక సూచికలు, బలమైన పన్ను వసూళ్లు, రికార్డు స్థాయిలో విదేశీ మారక నిల్వలు,  రూపాయిలో స్థిరత్వం,  సరుకుల ఎగుమతులు మరింత మెరుగుపడతాయని అసోచామ్​ అంచనా వేసింది.