భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఐదు రాష్ట్రాల్లో తగ్గలే

భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఐదు రాష్ట్రాల్లో తగ్గలే

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు 30 వేల దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29 వేల 689 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 132 రోజుల తర్వాత 30 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోలిస్తే దాదాపు 10 వేల కేసులు తగ్గాయి. ఇక నిన్న కరోనాతో 415 మంది ప్రాణాలు కోల్పోగా..మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 21 వేలు దాటింది. ఇప్పటివరకూ 3 కోట్ల 6 లక్షల 21 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3 లక్షల 98 వేల యాక్టివ్ కేసులున్నాయి. వీక్లీ  పాజిటివిటీ రేటు 2.33 శాతంగా ఉండగా..డెయిలీ పాజిటివిటీ రేటు 1.73 గా ఉంది. దేశవ్యాప్తంగా రివకరీ రేటు 97.39 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 42,363 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 66,03,112 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 44,19,12,395 డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఐదు రాష్ట్రాల్లోనే 72 శాతం కేసులు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 11,586 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 4,877, తమిళనాడులో 1,785, ఒడిశాలో 1,637, ఆంధ్రప్రదేశ్‌లో 1,627 చొప్పున కొత్తగా కరోనా కేసులు వచ్చాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 72.45 శాతం కేసుల నమోదవుతున్నాయి. ఒక్క కేరళలోనే 39.02 శాతం రోజువారీ కేసులు వస్తున్నాయి. మరణాలు కూడా కేరళలోనే (135) ఎక్కువగా ఉన్నాయి.