Asia Cup 2025 Final: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. 20 పరుగులకే మూడు వికెట్లు

Asia Cup 2025 Final: టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. 20 పరుగులకే మూడు వికెట్లు

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ హోరీ హోరీగా సాగుతోంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో టీమిండియా తడబడుతోంది. తొలి నాలుగు ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఓపెనర్లతో పాటు కెప్టెన్ సూర్య కుమారా యాదవ్ వికెట్ ను కోల్పోయింది. పాకిస్థాన్ పేసర్లు పవర్ ప్లే లో విజృంభించడంతో మన బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ప్రస్తుతం పవర్ ప్లే లో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ క్రమంలో షహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఇండియా 7 పరుగులు రాబట్టింది. రెండో ఓవర్ తొలి బంతికి ఒక స్లో బంతితో ఫహీమ్ అష్రాఫ్ ఓపెనర్ అభిషేక్ శర్మను బోల్తా కొట్టించాడు. స్లో బంతిని భారీ షాట్ ఆడాలని చూసిన అభిషేక్ మిడాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన సూర్య కుమార్ యాదవ్ 5 బంతులాడి కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అఫ్రిది బౌలింగ్ లో ఔటయ్యాడు. కాసేపటికే గిల్ కూడా ఔట్ కావడంతో ఇండియా 20 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సంజు శాంసన్ (4), తిలక్ వర్మ (14) క్రీజ్ లో ఉన్నారు.   

అంతకముందు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) తప్ప మిగిలిన వారందరూ విఫలం కావడంతో పాకిస్థాన్ నిర్ణీత 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.