
కేవలం 20 సెకన్లు. మన ‘హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ)’ అలా గాల్లో దూసుకెళ్లుంటే చాలు. భారతదేశ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరేది. ప్రపంచంలో స్క్రామ్ జెట్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా ఇండియా అవతరించేది. కానీ ఓ చిన్న సాంకేతిక సమస్య డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) ఎంతో శ్రమించి రూపొందించిన హెచ్ఎస్టీడీవీ సువర్ణావకాశాన్ని చేజార్చింది.
మిషన్ పరంగా సక్సెస్ అయినా నిర్ణీత సమయం గాల్లో ప్రయాణించడంలో విఫలమైంది. దీంతోపాటు నిర్దేశించుకున్న కొన్ని టెక్నికల్ పాయింట్లను హెచ్ఎస్టీడీవీ అందుకోలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని డీఆర్డీవో పెద్దాఫీసర్లు వెల్లడించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు అగ్ని–1 బాలిస్టిక్ మిస్సైల్ లాంచ్ వెహికిల్‌ను వాడి నింగిలోకి పంపారు. రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సెన్సర్లు.. వెహికిల్‌ను టెస్టు పూర్తయ్యే వరకూ ట్రాక్ చేసినట్లు డీఆర్‌డీవో చెప్పింది. అయితే, కీలకమైన టెక్నాలజీల పరీక్ష విజయం సాధించిందా లేదా అన్నది మాత్రం వెల్లడించ లేదు. హెచ్ఎస్టీడీవీని టెస్టు చేయడం ఇదే తొలిసారి.
గాల్లోకి ఎగిరాక ఏం జరిగింది?
‘‘హెచ్ఎస్టీడీవీ స్క్రామ్‌జెట్ క్రూయిజ్ వెహికిల్’ను అగ్ని–1 లాంచ్ వెహికిల్‌లోని సాలిడ్ రాకెట్ మోటారుకు డీఆర్డీవో అమర్చింది. అగ్ని–1 లాంచ్ వెహికిల్, హెచ్ఎస్టీడీవీ క్రూయిజ్ వెహికిల్‌ను గాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లాలి. అక్కడ అగ్ని–1 వెహికిల్ నుంచి హెచ్ఎస్టీడీవీ విడిపోయి తనంతట తానే మండుతూ, హైపర్ సోనిక్ వేగం(మాక్ 6)తో దూసుకెళ్లి, నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవాలి. లాంచ్ ప్యాడ్ నుంచి గాల్లోకి ఎగిరిన అగ్ని–1 లాంచ్ వెహికిల్ డీఆర్‌డీవో నిర్దేశించుకున్న ఎత్తుకు హెచ్ఎస్టీడీవీని తీసుకెళ్లడంలో విఫలమైందని తెలిసింది. కానీ అగ్ని–1లోని ఓ బూస్టర్ డీఆర్డీవో అదుపు తప్పింది. దీంతో నిర్ణీత ఎత్తుకు వెళ్లడంలో అది ఫెయిలైంది. వెహికిల్‌లోని వస్తువుల బరువు ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగిందని సమాచారం. దీని వల్ల టెస్టు మొత్తం విఫలమైంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు ఒకరు వెల్లడించారు. తద్వారా తొలి అడుగు విఫలమైందన్నారు.
ఏంటీ స్క్రామ్ జెట్?
సూపర్ సోనిక్ కంబష్షన్ రామ్ జెట్(స్క్రామ్ జెట్) ఇంజన్ టెక్నాలజీ హైపర్ సోనిక్ వేగంతో రాకెట్లు, క్రూయిజ్ మిస్సైల్స్‌ను టార్గెట్ వైపు తీసుకెళ్తుంది. హెచ్ఎస్టీడీవీలో వాడిన స్క్రామ్ జెట్ ఇంజన్ ను కిరోసిన్‌తో నడిచేలా డీఆర్‌డీవో తయారు చేసింది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితే మిలటరీకి కొండంత అండగా ఉంటుంది. ఉపగ్రహాలనూ అతి తక్కువ ఖర్చుతో ప్రయోగించొచ్చు. అలాగే లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను మరింత శక్తిమంతంగా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అవసరాలకు మన వద్ద ఉన్న అత్యుత్తమ టెక్నాలజీ రామ్ జెట్. సూపర్ సోనిక్ వేగం(మాక్ 3)ను అందుకున్న తర్వాత దీని పనితీరు బలహీనపడుతుంది. అందుకే మెరుపు వేగంతో దూసుకెళ్లే టెక్నాలజీ స్క్రామ్ జెట్‌పై ప్రపంచం కన్ను పడింది. అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్క్రామ్ జెట్ టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేసుకున్నాయి. దీని అభివృద్ధిలో ఇండియాకు సాయపడేందుకు రష్యా ఒప్పుకుంది. కానీ అమెరికా ఆంక్షలతో ఆ డీల్‌ను ఉపసంహరించుకుంది.