
అబుదాబి: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా.. ఆసియా కప్‌లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 21 రన్స్ తేడాతో ఒమన్‌పై గెలిచింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 188/8 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (45 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీ చేయగా, అభిషేక్ శర్మ (15 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), తిలక్ వర్మ (29) రాణించారు. తర్వాత ఒమన్ 20 ఓవర్లలో 167/4 స్కోరుకే పరిమితమైంది. ఆమిర్ కలీమ్ (46 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), హమ్మద్ మీర్జా (33 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పోరాడినా ప్రయోజనం దక్కలేదు. శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
శాంసన్ జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినా శాంసన్ నిలకడగా ఆడి మంచి స్కోరు అందించాడు. రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్ (5) ఔటయ్యాడు. 6/1 స్కోరు వద్ద వచ్చిన శాంసన్, అభిషేక్‌కు అండగా నిలిచాడు. మూడో ఓవర్‌లో 4, 6, 4తో అభిషేక్ బ్యాట్ ఝుళిపిస్తే, తర్వాతి ఓవర్‌లో శాంసన్ సిక్స్‌తో కుదురుకున్నాడు. తర్వాతి రెండు ఓవర్లలో అభిషేక్ మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లేలో ఇండియా 60/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో శాంసన్ 6, 4తో జోరు పెంచాడు. కానీ 8వ ఓవర్‌లో ఇండియాకు డబుల్ స్ట్రోక్ తగిలింది. మూడు బాల్స్ తేడాలో అభిషేక్, హార్దిక్ పాండ్యా (1) ఔటయ్యారు. రెండో వికెట్‌కు 66 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. శాంసన్‌తో కలిసిన అక్షర్ పటేల్ (13 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) స్ట్రయిక్ రొటేట్ చేయడంతో ఫస్ట్ టెన్‌లో ఇండియా 100/3 స్కోరు చేసింది. తర్వాత అక్షర్ 4, 4, 6 కొట్టి 12వ ఓవర్‌లో వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌కు 45 రన్స్ భాగస్వా్మ్యం ముగిసింది. శాంసన్ ఫోర్‌తో టచ్ కొనసాగించినా, 14వ ఓవర్‌లో శివమ్ దూబే (5) నిరాశపర్చడంతో 15 ఓవర్లలో స్కోరు 140/5గా మారింది. కొత్తగా వచ్చిన తిలక్ వర్మ ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించాడు. 6, 4. 6 బాదాడు. 41 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన శాంసన్ 18వ ఓవర్‌లో ఔట్‌కావడంతో ఆరో వికెట్‌కు 41 రన్స్ జతయ్యాయి. 19వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో తిలక్, అర్ష్‌దీప్ సింగ్ (1) వెనుదిరిగారు. లాస్ట్ ఓవర్‌లో హర్షిత్ రాణా (13 నాటౌట్) సిక్స్‌తో ఇండియా మంచి టార్గెట్‌ను నిర్దేశించింది. సూర్య బ్యాటింగ్‌కు రాలేదు.
పోరాడినా..
ఛేజింగ్‌లో ఒమన్‌కు మంచి ఆరంభం లభించింది. ఫోర్లతో ఖాతాలు తెరిచిన ఓపెనర్లు జతిందర్, ఆమిర్ ఉన్నంతసేపు దడదడలాడించారు. ఓవర్‌కు ఓ బౌండ్రీ రాబట్టడంతో పాటు వేగంగా సింగిల్స్ తీసి స్ట్రయిక్ రొటేట్ చేశారు. దీంతో 44/0తో పవర్‌ప్లేను ముగించారు. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత బౌలర్లు మార్చిన సూర్య తొలి వికెట్ సాధించాడు. 9వ ఓవర్‌లో కుల్దీప్ (1/23) జతిందర్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆమిర్‌తో జత కలిసిన హమ్మద్ మీర్జా కూడా నిలకడగా ఆడాడు. దీంతో ఫస్ట్ టెన్‌లో స్కోరు 62/1కి పెరిగింది. ఇక్కడి నుంచి ఇద్దరు మంచి సమన్వయంతో ఆడారు. మీర్జా 4, 4 బాదితే ఆమిర్ 6,4, 4, 6తో 38 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టాడు. దాంతో స్కోరు 15 ఓవర్లలో 116/1గా మారింది. 16వ ఓవర్‌లో మీర్జా రెండు సిక్స్‌లతో రెచ్చిపోయాడు. తర్వాతి ఓవర్‌లోనూ 4, 4తో 10 రన్స్ రాబట్టాడు. ఇక 18 బాల్స్‌లో 48 రన్స్ అవసరమైన దశలో 4, 4 కొట్టి ఆమిర్ ఔటయ్యాడు. రెండో వికెట్‌కు 93 రన్స్ జతకావడంతో విజయంపై ఆశలు పెరిగాయి. కానీ 30 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన మీర్జాను 19వ ఓవర్‌లో హార్దిక్ (1/26) పెవిలియన్‌కు పంపడంతో ఒమన్ ఛేదనలో వెనకబడింది. చివరి 6 బాల్స్‌లో 36 రన్స్ అవసరం కాగా 12 రన్స్‌తో సరిపెట్టుకుంది. అర్ష్‌దీప్, హర్షిత్ చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 188/8 (శాంసన్ 56, అభిషేక్ శర్మ 38, షా ఫైజల్ 2/23). ఒమన్: 20 ఓవర్లలో 167/4 (ఆమిర్ 64, మీర్జా 51, కుల్దీప్ 1/23).