IND vs AUS 2nd T20I: టీమిండియాకు హేజల్ వుడ్ దెబ్బ.. హాఫ్ సెంచరీతో పరువు కాపాడిన అభిషేక్ శర్మ

IND vs AUS 2nd T20I: టీమిండియాకు హేజల్ వుడ్ దెబ్బ.. హాఫ్ సెంచరీతో పరువు కాపాడిన అభిషేక్ శర్మ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 లో ఇండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ, హర్షిత్ రానా   తప్పితే మిగిలిన వారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి జట్టు పరువును కాపాడాడు. హర్షిత్ రానా 35 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మార్కస్ స్టోయినిస్ కు ఒక వికెట్ దక్కింది.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ గిల్ క్రీజ్ లో ఉన్నంత సేపు తడబడి కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. మూడో స్థానంలో సంజు శాంసన్ కు ప్రమోషన్ వస్తే కేవలం రెండు పరుగులకే నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ డకౌటయ్యాడు. దీంతో ఇండియా 32 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో హేజల్ వుడ్ మూడు వికెట్లు తీసుకొని ఇండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు. 

Also Read : ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. జెమీమాతో కలిసి పాట పాడతా

పవర్ ప్లే తర్వాత ఇండియా రనౌట్ రూపంలో అక్షర్ పటేల్ వికెట్ కోల్పోయింది. 49 పరుగులకే సగం జట్టును కోల్పోయిన టీమిండియాను అభిషేక్ శర్మ, హర్షిత్ రానా ఆదుకున్నారు. ఆరో వికెట్ కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టు స్కోర్ ను 100 పరుగుల మార్క్ దాటించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 35 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన రానా భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరడంతో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న అభిషేక్ 19 ఓవర్లో ఔట్ కావడంతో ఇండియా కథ ముగిసింది.