
- రష్యా, చైనాతో దోస్తీతో ఇండియాకు మంచి ముగింపు ఉండదని వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్నవారో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంతో వాణిజ్య చర్చలపై ఏదో ఒకరోజు ఇండియా దారికి రావాల్సిందేనన్నారు. ‘రియల్ అమెరికాస్ వాయిస్’ షోలో నవారో ఈ కామెంట్స్ చేశారు. భారత్‌ను ‘టారిఫ్ మహారాజా’గా అభివర్ణించారు. ‘‘ ఇది పూర్తిగా నిజం.
అమెరికాపై ప్రపంచంలోనే భారత్ అత్యధిక సుంకాలను విధిస్తున్నది. మనం దీనిని ఎదుర్కోవాల్సి వస్తున్నది” అని అన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ముందు రష్యానుంచి క్రూడ్ ఆయిల్‌ను భారత్ కొనలేదని పేర్కొన్నారు. దీంతో యుద్ధం కోసం అమెరికా పన్ను చెల్లింపుదారులు మరింత డబ్బు పంపాల్సి వస్తున్నదని అన్నారు.
బ్రిక్స్ దేశాలు ‘రక్త పిశాచులు’..
జపాన్, యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలాంటి దేశాలు అమెరికాతో మంచి వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకున్నాయని నవారో తెలిపారు. వీటిలాగే ఏదో ఒకరోజు ఇండియా కూడా తమతో వాణిజ్య చర్చల్లో దిగివస్తుందని చెప్పారు.
ఒకవేళ రష్యా, చైనాతో జతకడితే భారత్‌కు మంచి ముగింపు ఉండదని హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలను ‘రక్త పిశాచులు’ అని అన్నారు. వారి అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అమెరికా ఖజానాకు హాని కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఆ కూటమి ఎక్కువ కాలం నిలబడదన్నారు.