బరోడా: ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డేకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పోటెత్తనున్నారు. గురువారం ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించగా 8 నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయాయి. రోహిత్, కోహ్లీ ఆటను చూడటానికి ఫ్యాన్స్ ఎంతగా ఆరాటపడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ టిక్కెట్ల బుకింగ్ తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ వాటిని కూడా ప్రకటిస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో బారులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20లకు గుడ్‌బై చెప్పిన రో–కో జోడీ వన్డేల్లో మాత్రమే ఆడుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్‌లతో పాటు విజయ్ హజారే ట్రోఫీలోనూ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో టాప్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరి ఆటను మరోసారి చూడాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 11న ఇండియా, కివీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియాను శనివారం ప్రకటించే చాన్స్ ఉంది.
