V6 News

చవకగా న్యూజిలాండ్ వస్తువులు.. మన దేశంతో ఎఫ్టీఏ ఖరారు

చవకగా న్యూజిలాండ్ వస్తువులు.. మన దేశంతో ఎఫ్టీఏ ఖరారు
  • ఇండియా ఎగుమతులపై సుంకం నిల్​
  • రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులకు చాన్స్
  • కొన్ని రంగాలకు రక్షణ

న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య అధికారికంగా ఫ్రీ ట్రేడ్​అగ్రిమెంట్​(ఎఫ్​టీఏ) కుదిరింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టోడ్ మెక్‌‌‌‌క్లే ఢిల్లీలో ఈ ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశారు. ఫలితంగా న్యూజిలాండ్ ఎగుమతి చేసే భారతీయ ఎగుమతులకు సుంకం ఉండదు.

ప్రతిగా భారత్ కూడా న్యూజిలాండ్ నుంచి వచ్చే 70 శాతం వస్తువులపై సుంకాలను తొలగించడానికి అంగీకరించింది. దీనివల్ల జనానికి ఆ దేశపు వస్తువులు చవకగా లభిస్తాయి. ఒక అభివృద్ధి చెందిన దేశంతో కేవలం తొమ్మిది నెలల్లోనే చర్చలు ముగించి ఇండియా ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. దీనివల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.43,500 కోట్లు) చేరుతుందని అంచనా. 

భారత్ తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లోకి న్యూజిలాండ్​ నుంచి 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.74 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులు రానున్నాయి. ఈ ఒప్పందం భారతీయ నిపుణులు, మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు కొత్త అవకాశాలను అందిస్తుంది. న్యూజిలాండ్​ పార్లమెంటు ఆమోదం పొందాక ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది.

పెరగనున్న భారతీయ ఎగుమతులు

* టెక్స్​టైల్స్​, దుస్తులు: ఐదు శాతం టారిఫ్‌ల తొలగింపు వల్ల భారతీయ వస్త్రాలకు పసిఫిక్ దేశాల్లో గిరాకీ పెరుగుతుంది.

* లెదర్​, చెప్పులు: సుంకం లేకుండా న్యూజిలాండ్​కు అమ్మడం వల్ల ఆగ్రా, కాన్పూర్ వంటి నగరాల్లోని ఇండస్ట్రీలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది.

* రత్నాలు, ఆభరణాలు: అంతర్జాతీయ ప్రత్యర్థులతో పోలిస్తే భారతీయ హస్తకళలకు డిమాండ్​, పోటీతత్వం పెరుగుతుంది. ఎగుమతులు పెరుగుతాయి.

* ఇంజినీరింగ్, ఆటో భాగాలు: భారత్​లో తయారైన యంత్రాలు, ఆటో విడిభాగాలపై సుంకాలను తొలగించారు.

ధరలు తగ్గే వస్తువులు:


* గొర్రె మాంసం, ఉన్ని: మొదటి రోజు నుంచే టారిఫ్​లు తొలగించడంతో నాణ్యమైన ఉన్ని, మాంసం ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి.

* కలప, అటవీ ఉత్పత్తులు: భారత్ ఫర్నిచర్, నిర్మాణ పరిశ్రమలకు చౌకగా ముడి సరుకులు అందుతాయి.

* ప్రీమియం వైన్: ఆస్ట్రేలియా ఒప్పందం తరహాలోనే పదేళ్ల కాలంలో సుంకాలు తగ్గుతాయి.
సముద్ర ఆహారం: ప్రీమియం మజిల్స్, సాల్మన్ వంటి చేపలపై టారిఫ్​లను ఏడేళ్లలో దశలవారీగా తొలగిస్తారు.

ఈ రంగాలకు రక్షణ
* డెయిరీ : ఈ రంగంపై భారత్ వెనక్కి తగ్గలేదు. పాలు, క్రీమ్, చీజ్, వెన్న, పెరుగు వంటి వాటిని సుంక తగ్గింపు నుంచి మినహాయించింది. దీనివల్ల దేశంలోని ఎనిమిది కోట్ల మంది పాడి రైతుల ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది.

* వ్యవసాయ ఉత్పత్తులు: మార్కెట్ ఒడిదుడుకులను అరికట్టడానికి చక్కెర, ఉల్లిపాయలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, వంట నూనెలను మినహాయింపు జాబితాలోనే ఉంచారు.

* లోహాలు, రక్షణ రంగం: స్థానిక పరిశ్రమలు, జాతీయ భద్రత దృష్ట్యా రాగి, అల్యూమినియం, డిఫెన్స్‌ వస్తువులకు రక్షణ కల్పించారు.

తగ్గనున్న గల్ఫ్​ ఎఫెక్ట్​
గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్ జలసంధి వద్ద షిప్పింగ్ మార్గాలకు ఆటంకాలు ఏర్పడితే భారత్ నుంచి జరిగే ఎగుమతులకు న్యూజిలాండ్ ప్రత్యామ్నాయ మార్కెట్‌గా మారుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. హార్మూజ్ సంక్షోభం వల్ల ప్రభావితమయ్యే భారత ఎగుమతుల్లో కనీసం 12 శాతాన్ని న్యూజిలాండ్ భర్తీ చేయగలదని భావిస్తున్నారు.

హార్మూజ్ మార్గం ద్వారా రవాణా అయ్యే వాటిలో మందులు (417.2 మిలి యన్ డాలర్లు), సౌందర్య సాధనాలు (267.3 మిలియన్ డాలర్లు), ఆహార పదార్థాలు (119.2 మిలియన్ డాలర్లు), పారిశ్రామిక యంత్రాలు (98.8 మిలియన్ డాలర్లు), ఎక్స్కవేటర్లు వంటివి ఉన్నాయి.