ట్రంప్తో ఎట్లా డీల్ చేయాల్నో.. మోదీకి సలహా ఇస్తా:నెతన్యాహు

ట్రంప్తో ఎట్లా డీల్ చేయాల్నో.. మోదీకి సలహా ఇస్తా:నెతన్యాహు
  • ఆ ఇద్దరూ నాకు మంచి దోస్తులు
  • టారిఫ్​ల వివాదం త్వరలో ముగుస్తది
  • ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు కామెంట్

జెరూసలేం: తనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మంచి దోస్తులని.. వారిద్దరి మధ్య జరుగుతున్న టారిఫ్​ల వివాదానికి త్వరలోనే తెరపడుతుందని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ అన్నారు. వాణిజ్యం విషయంలో ట్రంప్​తో మధ్యవర్తిత్వం ఎలా వ్యవహరించాలో, డీల్​ ఎలా కుదుర్చుకోవాలో మోదీకి తాను కొన్ని సలహాలు ఇవ్వదలచుకున్నానని చెప్పారు. 

భారత్​, అమెరికా మధ్య బలమైన బంధం ఉందని.. టారిఫ్​ల వివాదంతో దానికి ఎలాంటి సమస్య రాదని ఆయన అన్నారు. గురువారం ఇజ్రాయెల్​లోని జెరూసలేంలో భారత రాయబారి జేపీ సింగ్​తో నెతన్యాహూ భేటీ అయ్యారు. ఇజ్రాయెల్​, భారత్​ సంబంధాలపై చర్చించారు. 

అనంతరం మీడియాతో నెతన్యాహూ మాట్లాడారు. ‘‘ఇండియా, అమెరికా బంధం స్ట్రాంగ్​గా ఉంది. ఇరు దేశాల ప్రయోజనాలకు తగ్గట్టు టారిఫ్​ల సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్న. ట్రంప్​తో ఎలా డీల్​ చేయాలో మోదీకి నేను అడ్వయిజ్​ ఇస్త. కాకపోతే అది పర్సనల్​గా మాత్రమే చెప్త” అని ఆయన చెప్పారు.  

భారత్​, అమెరికా మధ్య టారిఫ్​ సమస్య ముగిస్తే అది ఆ ఇరు దేశాలకు మిత్ర దేశమైన తమ ఇజ్రాయెల్​కు కూడా మంచి పరిణామం అవుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్ అంటే తనకు ఇష్టమని, అక్కడ పర్యటించాలని ఉందని నెతన్యాహూ అన్నారు. త్వరలోనే ఇండియాను విజిట్​ చేస్తానని చెప్పారు.