రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం ఉల్లంఘన కాదు

రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం ఉల్లంఘన కాదు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగడంతో అమెరికా, పలు యూరోపియన్ దేశాలు.. రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టి సతమతం చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశంతో లావాదేవీలను బంద్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తన వద్ద ఉన్న క్రూడాయిల్‌ చౌకగా అమ్ముతామని భారత్‌కు ఆఫర్ ఇచ్చిందని, ఈ ప్రతిపాదనపై భారత్ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా స్పందించింది. రష్యా ఇస్తున్న డిస్కౌంట్ ఆఫర్‌‌ను భారత్ వాడుకుని, ఆ దేశం నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తే అదేమీ తాము విధించిన ఆంక్షల ఉల్లంఘన కిందికి రాదని పేర్కొంది.  అయితే ఈ సమయంలో రష్యా ఆఫర్‌‌ను వాడుకుంటే చరిత్రలో భారత్ తప్పు వైపు నిలబడిందన్న చెడ్డ పేరు నిలబడిపోతుందని అభిప్రాయపడింది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉందన్న వార్తలపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పై వ్యాఖ్యలు చేశారు. 

రష్యా నుంచి ఇప్పుడు లావాదేవీలు చేస్తూ ఆ దేశానికి మద్దతుగా ఉండడమంటే ఉక్రెయిన్‌పై చేసిన దండయాత్రను సమర్థించమే అవుతుందని జెన్ సాకీ అన్నారు. ఇప్పుడు భారత్ ఎటు వైపు ఉంటుందో నిర్ణయం తీసుకోవాలని ఆమె చెప్పారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించడం కిందకు రాకపోయినప్పటికీ, అది ఒక తప్పుడు నిర్ణయంగానే చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు.