రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్

రిటైర్మెంట్ ప్రకటించిన యూసఫ్ పఠాన్, వినయ్ కుమార్

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ వినయ్ కుమార్ క్రికెట్‌ నుంచి సన్యాసం తీసుకున్నాడు. మూడు ఫార్మాట్‌‌ల్లో ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ మేరకు రిటైర్మెంట్‌‌కు సంబంధించి శుక్రవారం అధికార స్టేట్‌‌మెంట్‌‌ను విడుదల చేశాడు. టీమిండియా తరఫున ఒక టెస్టు, 31 వన్డేలు, 9 టీ20ల్లో వినయ్ ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 49 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ ప్రకటించడం అంత సులువు కాదని చెప్పిన వినయ్ కుమార్.. ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఆటకు గుడ్ బై చెప్పేందుకు ఒక రోజు వస్తుందని తెలిపాడు. ఇన్నేళ్ల కెరీర్‌‌లో తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లతో కలసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.

మరో టీమిండియా క్రికెటర్, ఆల్‌‌రౌండర్ యూసఫ్ పఠాన్ కూడా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల గేమ్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని యూసఫ్ పఠాన్ ట్వీట్ చేశాడు. భారత్‌‌కు వరల్డ్ కప్ అందించి ఇవ్వడం, సచిన్ టెండూల్కర్‌ను భుజాల పైకి ఎత్తుకొని నడిచిన క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పఠాన్ పేర్కొన్నాడు. 38 ఏళ్ల యూసఫ్ తన కెరీర్‌‌లో టీమిండియా తరఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో యూసఫ్ ఉండటం విశేషం.