ఆసియా కప్ లో మరోసారి భారత్- పాక్ పోరు..మ్యాచ్ ఎప్పుడంటే..?

ఆసియా కప్ లో మరోసారి భారత్- పాక్ పోరు..మ్యాచ్ ఎప్పుడంటే..?

ఆసియా కప్ లో గ్రూప్ మ్యాచులో భాగంగా భారత్- పాకిస్థాన్ పోరు మొత్తం చూడకుండానే వరుణుడు అభిమానులని నిరాశ పరిచాడు. అయితే ఈ దాయాదుల సమరం చూడడానికి మరోసారి అవకాశం వచ్చింది. గ్రూప్ ఏ లో భాగంగా నిన్న నేపాల్ తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయ సాధించింది. దీంతో సూపర్ ఫోర్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. శ్రీలంక ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుండగా.. కొలంబోలోని ప్రేమదాసు స్టేడియంలో ఈ మ్యాచ్ చూడడం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్నారు. 

నేపాల్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ..

సూపర్ ఫోర్ కి చేరుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో టీమిండియా పసికూన నేపాల్ ని 10 వికెట్ల తేడాతో చిత్తు  చేసింది. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో సోమల్ కామీ 48 పరుగులతో రాణించాడు. ఇన్నింగ్స్ అనంతరం పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచులో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా సవరించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74) శుభమాన్ గిల్ (67) 20.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. 

ఒక్క బెర్ట్ కోసం ఆ రెండు జట్లు:

సూపర్-4 లో ఇప్పటికే మూడు జట్లు తమ స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకోగా.. మిగిలిన ఒక్క బెర్త్ కోసం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నేడు పోటీ పడతాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయినా నెట్ రన్ రేట్ విషయంలో జాగ్రత్త పడితే సూపర్-4 కి చేరుకునే అవకాశం ఉంది. మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 కి అర్హత సాధించాలంటే లంకపై భారీ విజయం సాధించాల్సిందే.