మహిళల వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో జరగబోయే ఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. 47 ఏళ్ళ వరల్డ్ కప్ చరిత్రలో మూడో సారి ఫైనల్ కు వెళ్లిన మన జట్టు ఈ సారి టైటిల్ గెలవాలనే గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ఫైనల్ జరగనుంది. సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాను ఓడించాలంటే అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ టీంఇండియాలో ఫుల్ జోష్ నింపింది. 339 పరుగులను ఛేజ్ చేయడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. సౌతాఫ్రికాపై జరగనున్న మెగా ఫైనల్లో ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో చూద్దాం..
సౌతాఫ్రికాపై జరగబోయే ఫైనల్లో ఓపెనర్ షెఫాలీ వర్మను ప్లేయింగ్ 11 నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీక రావల్ గాయపడడంతో లక్కీగా జట్టులోకి వచ్చిన షెఫాలీ 10 పరుగులే చేసి నిరాశపరించింది. దూకుడుగా ఆడతుంది అనే పేరున్న ఈ యువ ఓపెనర్ ఫైనల్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తుంది. షెఫాలీ ప్లేస్ లో హర్లీన్ డియోల్ తుది జట్టులోకి రావొచ్చు. డియోల్ మంచి ఫామ్ లో ఉంది. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లోనూ కొని మంచి ఇన్నింగ్స్ లు ఆడింది. దీంతో స్మృతు మందానతో కలిసి ఇండియా ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. సెమీ ఫైనల్లో చోటు కోల్పోయిన డియోల్ ఫైనల్ లో ఛాన్స్ వస్తుందేమో చూడాలి.
క్రాంతి గౌడ్ ఔట్:
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ పేలవ ప్రదర్శన చేసింది. 6 ఓవర్లు బౌలింగ్ వేసి ఏకంగా 58 పరుగులు ఇచ్చింది. ఆమె ఎకానమీ ఓవర్‌కు 9.70 పరుగులు ఉండడం ఆందోళనకు గురి చేస్తుంది. అలిస్సా హీలీ వికెట్‌ను పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు ఇవ్వడంతో ఆమె స్థానంలో అరుంధతి రెడ్డికి అవకాశం దక్కొచ్చు. అరుంధతి రెడ్డి ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. ఫైనల్ కు ఆమెను బరిలోకి దింపాలా.. వద్దా అని జట్టు యాజమాన్యం ఆలోచిస్తుంది. సౌతాఫ్రికా జట్టు స్పిన్ ఆడడంలో బలహీనం కాబట్టి స్నేహ రానాకి తుది జట్టులో స్థానం లభించినా పెద్దగా ఆశ్చర్యం లేదు.
ఫైనల్ జరగబోయే డివై పాటిల్ స్టేడియంలో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం ఫైనల్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ టోర్నమెంట్ లో ఈ స్టేడియంలో జరిగిన చాలా మ్యాచ్ లు వర్షం కారణంగా ఫలితం రాలేదు. లీగ్ స్టేజ్ లో ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్‌కు పలు మార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై ఇండియా ఆడిన లీగ్ మ్యాచ్ కూడా ఫలితం రాకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. గెలిచిన జట్టు ఛేజింగ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వర్షం ముప్పు ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం బౌలర్లకు ప్రతికూలంగా మారనుంది.
ఇండియా ప్లేయింగ్ 11(అంచనా):
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్
సౌతాఫ్రికా ప్లేయింగ్ 11 (అంచనా):
లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నరీ డెర్క్‌సెన్, అన్నెకే బాష్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా
