వీర జ‌వాన్ల త్యాగం వృథా కాదు.. దేశ ప్ర‌జ‌ల‌కిదే నా హామీ: ప‌్ర‌ధాని మోడీ

వీర జ‌వాన్ల త్యాగం వృథా కాదు.. దేశ ప్ర‌జ‌ల‌కిదే నా హామీ: ప‌్ర‌ధాని మోడీ
  • సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ భేటీ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌
  • 2 నిమిషాలు మౌనం పాటించిన‌ మోడీ, అమిత్ షా, 15 మంది సీఎంలు

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రులైన వీర జ‌వాన్ల త్యాగాలు వృథా కావ‌ని, దేశ ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తున్నాన‌ని చెప్పారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. భార‌త్ శాంతిని కాంక్షిస్తోంద‌ని, అయితే రెచ్చ‌గొట్టుడు చ‌ర్య‌ల‌ను ఎంత‌మాత్రం ఉపేక్షించే ప్ర‌స‌క్తే లేద‌ని, త‌గిన జ‌వాబు చెప్పి తీరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై బుధ‌వారం ప‌లు రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ప్ర‌ధాని.. ఈ స‌మావేశంలో అమ‌ర జ‌వాన్ల‌కు నివాళి అర్పించారు. ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 15 మంది ముఖ్య‌మంత్రులు రెండు నిమిషాల పాటు నిల‌బ‌డి మౌనం పాటించారు. ఆ త‌ర్వాత‌ ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ.. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని అన్నారు. భార‌త్ ఎల్ల‌ప్పుడూ శాంతినే కోరుకుంటుంద‌ని, దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునే విష‌యంలో ఏమాత్రం వెనుక‌డుగేసే ప‌ని లేద‌ని చెప్పారు. భార‌త దేశ స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకోవ‌డంలో రాజీ లేద‌ని, అవ‌త‌లి ప‌క్షం దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే గ‌ట్టిగా తిప్పికొట్టే స‌త్తా భార‌త్‌కు ఉంద‌ని చెప్పారు.

ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ వ‌ద్ద చైనా సైనికులు భార‌త భూభాగంలోకి చొచ్చుకుని రావ‌డంతో సోమ‌వారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులయ్యారు. చైనా తీరు‌పై దేశం మొత్తం ఆగ్ర‌హంతో ర‌గిలిపోతోంది. స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌పై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల‌పై దేశంలోని అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జూన్ 19న అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించ‌బోతున్నారు.