పొల్యూషన్​ విషయంలో ఇండియా ప్రపంచంలోనే 8వ స్థానంలో...

పొల్యూషన్​ విషయంలో ఇండియా ప్రపంచంలోనే 8వ స్థానంలో...

న్యూఢిల్లీ: మనదేశంలో కాలుష్యం కొంత తగ్గినా.. సిటీల్లో మాత్రం రోజురోజుకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో పొల్యూషన్​ విషయంలో ఇండియా ప్రపంచంలోనే 8వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే మూడు స్థానాలు మెరుగైంది. ప్రస్తుతం పీఎం 2.5 లెవల్ ప్రతి క్యూబిక్​ బీటర్​కు 53.3 మైక్రోగ్రాములకు తగ్గింది. అయినా కూడా ఇప్పటికీ వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) సూచించిన సేఫ్టీ లెవల్​ కంటే మనదేశంలో కాలుష్యం పది రెట్లు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో ప్రపంచంలోని టాప్ 100 పొల్యూటెడ్​ సిటీల్లో 65 మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు ఏడాది టాప్​ 100లో 61 సిటీలు మాత్రమే ఉన్నాయి. 2022లో టాప్​ 50లో 39, టాప్​ 20లో 14, టాప్​ 10లో 6 సిటీలు ఉన్నాయి. కొత్త క్లాసిఫికేషన్​ ప్రకారం టాప్​ 10లో ఢిల్లీ, న్యూఢిల్లీ రెండూ ఉన్నాయి. 

131 దేశాల్లో డేటా సేకరణ

స్విస్​కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ మంగళవారం 2022కు సంబంధించిన ‘వరల్డ్​ ఎయిర్​ క్వాలిటీ రిపోర్ట్’ను విడుదల చేసింది. పొల్యూషన్​కు కీలకంగా భావించే పీఎం 2.5 లెవల్​ ఆధారంగా ఈ రిపోర్ట్​ను రెడీ చేశారు. మొత్తం 131 దేశాల్లోని 30 వేలకుపైగా గవర్నమెంట్, నాన్​గవర్నమెంట్​ మానిటర్ల నుంచి డేటాను సేకరించారు. 2017లో 2,200 సిటీలు మాత్రమే ఉండగా ఇప్పుడు 7,300 సిటీలను పరిగణనలోకి తీసుకున్నారు. పీఎం 2.5 శాతం కారణంగా ఏటా ఇండియాకు లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఈ రిపోర్ట్​ వెల్లడించింది. ఇందులో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్​మెంట్​ వల్ల జరుగుతున్న నష్టమే 20 నుంచి 35 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇండస్ట్రియల్​ యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్​ ప్లాంట్లు, బయోమాస్​ బర్నింగ్​ కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని పేర్కొంది. 

ఆగ్రాలో తగ్గింది

ఆగ్రాలో మాత్రం పొల్యూషన్ లెవెల్స్​ భారీగా తగ్గాయి. మొత్తంగా చూస్తే 31 సిటీల్లో రెండంకెల స్థాయిలో పొల్యూషన్​ లెవల్​ తగ్గింది. ఇందులో ఉత్తరప్రదేశ్​లోని 10, హర్యానాలోని 7 సిటీలు ఉన్నాయి. ఆగ్రాలో పొల్యూషన్​ 55 శాతం తగ్గింది. 2017–21 మధ్య పీఎం 2.5.. 85 మైక్రోగ్రాములుగా ఉంటే 2022లో అది 38 మైక్రోగ్రాములకు తగ్గింది. మరోవైపు 38 సిటీలు, టౌన్లలో గత సంవత్సరాలతో పోలిస్తే పొల్యూషన్​ పెరిగిందని ఈ రిపోర్ట్​ వెల్లడించింది. మెట్రో సిటీల విషయానికి వస్తే ఢిల్లీ తర్వాత అత్యంత కాలుష్య నగరంగా కోల్​కతా నిలిచింది. అయితే ఈ రెండు నగరాలకు మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది. చెన్నై కొంత వరకు క్లీన్​ సిటీగా కనిపిస్తోంది. అయినా అక్కడ సేఫ్టీ లెవల్​ కంటే పొల్యూషన్ ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. 2017 సగటు కంటే కాలుష్యం స్థాయి పెరిగిన మెట్రో సిటీలు హైదరాబాద్, బెంగళూరు మాత్రమే. ఈ లిస్ట్​లో హైదరాబాద్​ 199వ ప్లేస్​లో ఉంది.

ఢిల్లీ.. కాలుష్య రాజధాని కాదు

ఇకపై ప్రపంచంలో కాలుష్య రాజధాని ఢిల్లీ కాదు. ఆ స్థానాన్ని ఇప్పుడు చాడ్ ​రాజధాని ఎన్జామెనా ఆక్రమించింది. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. పాపులేషన్​ పరంగా చూస్తే ఎన్జామెనా జనాభా పది లక్షలు కాగా.. ఢిల్లీ జనాభా నలభై లక్షలకుపైగానే ఉంటుంది. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న గుర్గామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్​లో పాపులేషన్​ లెవల్స్​ అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. వీటిలో కాలుష్యం కొంత తగ్గినా ఇండియా సగటుతో పోలిస్తే ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉంది. 

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం లాహోర్

పాకిస్తాన్​లోని లాహోర్​ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. రెండో ప్లేస్​లో చైనాలోని హోటన్​ ఉంది. మూడో ప్లేస్​లో రాజస్థాన్​లోని భివాడి.. నాలుగో ప్లేస్​లో ఢిల్లీ ఉన్నాయి. 9వ స్థానంలో న్యూఢిల్లీ ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటికీ పీఎం 2.5 లెవల్​ 92.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది డబ్ల్యూహెచ్​వో సేఫ్​ లిమిట్​ కంటే 20 రెట్లు ఎక్కువ. అత్యంత కాలుష్య దేశాల జాబితాలో చాడ్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. రెండో ప్లేస్​లో ఇరాక్, మూడో ప్లేస్​లో పాకిస్తాన్​ ఉన్నాయి.