
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.303 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేశ్తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత సీఈవో మధుకర్ నాయక్, నూతన సీఈవో అరవింద్ కుమార్ ద్వివేదిని కలిసి మాట్లాడారు.
ఎస్క్రో ఖాతాలో జమ అయిన ఈ నిధులతో నాలాలు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టనున్నామని, ప్రజల సూచనల మేరకు ప్రాధాన్యతలు నిర్ణయించాలని సూచించారు. స్పందించిన ఆఫీసర్లు బుధవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ ప్రాంతాల్లోని నాలాలు, డ్రైనేజీ పనులకు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను బుధవారం ఉదయం 11 గంటలకు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి వచ్చి తెలియజేయాలన్నారు. తర్వాత డీఈవో దినేశ్‌రెడ్డితో సమావేశమై తిరుమలగిరిలోని బి–1 ల్యాండ్స్‌లో 4.71 ఎకరాల భూమిని క్రిస్టియన్ సెమెట్రీ నంబర్5కి కేటాయించాలని కోరారు. భూ బదలాయింపు విధానంలోనైనా కేటాయించవచ్చని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని పేర్కొన్నారు.