
- హరీశ్, కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ కు డిపాజిట్ గల్లంతవుతుందనే భయంతో బావ, బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ గల్లీ గల్లీ తిరుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రెండు అచ్చోసిన ఆంబోతుల్లా.. ఆ ఇద్దరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారని.. అయినా వారిని అక్కడి జనం నమ్మరని అన్నారు.
అసలైన దండుపాళ్యం బ్యాచ్ కేటీఆర్, హరీశ్ దేనని విమర్శించారు. గుండాయిజం, దందాలు చేసేటోళ్లంతా ఒక్కచోటికి చేరారని తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారని.. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇంకా బాగా తెలుసని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీతోనే బీఆర్ఎస్ కు దడ పుట్టిందని పేర్కొన్నారు. దీంతో బావ, బామ్మర్దులు నిద్రలేకుండా కనీసం డిపాజిట్ అయినా దక్కాలనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బస్తీ దవాఖానాల చుట్టు తిరుగుతున్నారని విమర్శించారు.
ఓట్ చోరీ అంటూ ఓటమి భయంతో కొత్త నినాదం ఎత్తుకున్న బీఆర్ఎస్.. 2023 వరకు అధికారంలో ఉన్నది ఎవరో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని హరీశ్, కేటీఆర్ కు ఎంపీ చామల సూచించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న షెటిలర్లను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు నానా తంటాలు పడుతున్నారని.. వారి విషయంలో షెటిలర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన గుండు సున్నాతో కూడా హరీశ్, కేటీఆర్ లో ఏమాత్రం అహంకారం తగ్గలేదని ధ్వజమెత్తారు.