అధిక వడ్డీ ఇస్తామంటూ రూ.కోట్లు వసూలు ..తొమ్మిది మంది అరెస్ట్‌‌.. నల్లగొండ పోలీసుల అదుపులో నిందితులు

అధిక వడ్డీ ఇస్తామంటూ  రూ.కోట్లు వసూలు ..తొమ్మిది మంది అరెస్ట్‌‌.. నల్లగొండ  పోలీసుల అదుపులో నిందితులు

నల్గొండ అర్బన్,వెలుగు :అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసి తప్పించుకు తిరుగుతున్నతొమ్మిది మందిని నల్గొండపోలీసులు పట్టుకున్నారు.కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం నల్గొండ ఎస్పీ శరత్‌‌చంద్ర పవార్‌‌ మీడియాకు వెల్లడించారు.

 నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్ల పలుగు తండాకు చెందిన రమావత్‌‌ మధునాయక్‌‌ పదో తరగతి పూర్తి చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. ఇదే తండాకు చెందిన బాలాజీనాయక్‌‌ అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి లగ్జరీ లైఫ్‌‌ గడిపేవాడు. బాలాజీ నాయక్ వద్ద కొంతకాలం ఏజెంట్‌‌గా పనిచేసిన మధునాయక్.. తాను కూడా అధిక వడ్డీ పేరుతో కోట్లు వసూలు చేయాలని, బాలాజీనాయక్‌‌ మాదిరిగా లగ్జరీ లైఫ్‌‌ గడపాలని ప్లాన్‌‌ వేశాడు. ఇందులో భాగంగా తన బావలు భరత్, బాబు, రమేశ్‌‌తో ముఠాగా ఏర్పడ్డాడు. 

హైదరాబాద్‌‌లో గోకుల నందన ఇన్‌‌ఫ్రా పేరుతో ఓ కంపెనీ ఓపెన్‌‌ చేసి ఏజెంట్లను నియమించుకున్నారు. తనకు జహీరాబాద్‌‌ దగ్గర వెంచర్లు, హైదరాబాద్‌‌లో పబ్బులు, స్పా సెంటర్లు, కర్నూల్‌‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని ఫేక్‌‌ డాక్యుమెంట్స్‌‌ సృష్టించి గిరిజనులను నమ్మించారు. నెలకు రూ.15 నుంచి రూ.18 వరకు వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ డబ్బులతో లగ్జరీ కార్లు, బంధువులు, స్నేహితుల పేరిట భవనాలు, భూములు కొనుగోలు చేశారు. మరికొన్ని డబ్బులను పబ్‌‌లు, స్పా సెంటర్లు, బెట్టింగ్, స్టాక్ మార్కెట్‌‌లో పెట్టి నష్టపోయారు. 

ఈ క్రమంలోనే బాలాజీనాయక్‌‌ను పోలీసులు అరెస్ట్‌‌ చేయడంతో.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని మధునాయక్‌‌పై ఒత్తిడి పెంచారు. అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మధునాయక్‌‌తో పాటు మొత్తం 9 మందిని అరెస్ట్‌‌ చేశారు. వారి నుంచి విలువైన భూమి పత్రాలు, నాలుగు కార్లు, 9 సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.