
- ఈ నెల 1న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ మినిట్స్ విడుదల
హైదరాబాద్, వెలుగు: గోదావరి కావేరి లింక్‌ను చేపడితే.. తరలించే నీళ్లలో తమకు సగం వాటా ఇవ్వాలని నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ)ని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ నెల 1న ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్ వీఎల్ కాంతారావు నేతృత్వంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ మంగళవారం విడుదల చేసింది. ఎన్‌డబ్ల్యూడీఏ ఆరో కన్సల్టెన్సీ మీటింగ్‌లో భాగంగా తమ డిమాండ్లను రాతపూర్వకంగా సమర్పించామని ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ తెలిపారని మినిట్స్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది.
అసలు లింక్లో భాగమేకాని కర్నాటకకు నీటి వాటాను ఎలా ఇస్తారని ఈఎన్సీ ప్రశ్నించారు. కర్నాటకకు నీళ్ల వాటా ఇవ్వొద్దన్నారు. లింక్‌ను తమ భూభాగం (తెలంగాణ) నుంచే చేపడుతున్నారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ.. లింక్లో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో 74 టీఎంసీలు ఇవ్వాలని స్పష్టం చేశారు. లింక్ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా తాము అంగీకరిస్తున్నామని, అదే సమయంలో తమ డిమాండ్లకు కేంద్రం కూడా ఒప్పుకోవాలని తేల్చి చెప్పారు.
గోదావరిపై నిర్మించిన పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. 74 టీఎంసీలకు తోడు.. వరద జలాల్లో 200 టీఎంసీలను వాడుకునేందుకు అనుమతులివ్వాలన్నారు. కృష్ణ బేసిన్లో రెండు రిజర్వాయర్లను నిర్మించి ఇవ్వాలన్నారు. కాగా, ఏపీ చేపడుతున్న నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులైన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్సార్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లతో తెలంగాణకు నష్టం జరుగుతుందని, వాటికి అనుమతులివ్వొద్దని తేల్చి చెప్పారు. ఈ డిమాండ్లను ఇప్పటికే ఆగస్టు 22న జరిగిన మీటింగ్‌లో రాతపూర్వకంగా ఇచ్చామని, వాటిని నెరవేర్చాలని స్పష్టం చేశారు.
మిగులు జలాల్లేవ్..లింక్ ఎట్ల సాధ్యం?: ఏపీ
గోదావరిలో మిగులు జలాలు లేవని, అలాంటప్పుడు జీసీ లింక్ ఎలా సాధ్యమవుతుందని ఎన్డబ్ల్యూడీఏని ఏపీ ప్రశ్నించింది. జీసీ లింక్లో తరలించే 148 టీఎంసీలు చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి సబ్‌బేసిన్ నుంచి వచ్చేవని, అది కూడా తాత్కాలికమేనని పేర్కొంది. ఆ తర్వాత హిమాలయాల నుంచి ఎప్పటికోగాని రాని నీళ్లతో భర్తీ చేసే ఆలోచన ఉన్నదని తెలిపింది. అలాంటప్పుడు జీసీ లింక్ ఎలా సాధ్యమవుతుందని ఏపీ కొర్రీలు పెట్టింది.
అది తాత్కాలిక ఒప్పందమే అయినా.. సభ్య రాష్ట్రాలకు అదనపు జలాలను కేటాయించేందుకు ఇప్పటికే అంగీకరించామని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ గుర్తు చేశారు. జీసీ లింక్లో తమకూ నీటి వాటాలు ఇవ్వాలని, ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు అంగీకరించాలని మహారాష్ట్ర డిమాండ్ చేసింది.