
జోహోర్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జోహోర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో ఇండియా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ఆఖరి మ్యాచ్‌లో ఇండియా 2–1తో మలేసియాపై నెగ్గింది. గుర్జోత్ సింగ్ (22వ ని), సౌరభ్ ఆనంద్ కుష్వాహా (48వ ని) ఇండియాకు పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ అందించారు. నవీనేశ్ పనికర్ (43వ ని) మలేసియాకు ఏకైక గోల్ అందించాడు. ఇక వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా మొదలు కావడం, మైదానం చిత్తడిగా ఉండటంతో ఆరంభంలో ఇరుజట్లు మెల్లగా కదిలాయి.
లాంగ్ పాస్‌లతో ఇండియన్ ఫార్వర్డ్స్.. మలేసియా స్ట్రయికర్లను అడ్డుకునే ప్రయత్నం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే రెండో క్వార్టర్‌లో రెండు పెనాల్టీలు లభించగా ఒకదాన్ని గోల్‌గా మలిచారు. అరైజిత్ కొట్టిన రీ బౌండ్ హిట్‌ను రిఫరీ తిరస్కరించాడు. ఆ వెంటనే గుర్జోత్ సింగ్ ట్యాప్ ఇన్‌తో రీ బౌండ్ బాల్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపి 1–0 ఆధిక్యంలో నిలిపాడు. తొలి హాఫ్‌లో తొమ్మిది పెనాల్టీ కార్నర్లను ఇండియా వృథా చేసింది. కానీ, ఎండ్స్ మారిన తర్వాత మలేసియా డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచింది. దీని నుంచి తేరుకునే క్రమంలో 43వ నిమిషంలో నవీనేశ్ గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. కానీ ఈ సంతోషాన్ని ఎక్కువసేపు ఉండనీయలేదు. ఐదు నిమిషాల తేడాలో ఆనంద్ కుష్వాహా గోల్ చేసి ఇండియా లీడ్‌ను 2–1కి పెంచాడు. 53వ నిమిషంలో మరో పెనాల్టీని వృథా చేసిన ఇండియా.. చివరి వరకు మలేసియాకు గోల్స్ ఇవ్వకుండా
అడ్డుకుంది.