
ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాపు గంట పాటు గ్రౌండ్‌లో హైడ్రామా నడిచింది. క్రికెట్ చరిత్రలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న పాకిస్తాన్ బోర్డు చైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్‌సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని, విన్నర్ మెడల్స్‌ను అందుకునేందుకు ఇండియా ఒప్పుకోలేదు. దాంతో ప్రెజెంటేషన్ సెర్మనీలో రన్నరప్ పాక్ ప్లేయర్లకు మాత్రమే మెడల్స్ అందించారు. ఇతర గెస్టుల నుంచి తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీప్లేయర్ పురస్కారాలు అందుకున్నారు. ఇండియా టీమ్ ట్రోఫీ తీసుకోవడం లేదని ప్రెజెంటర్ సైమన్ ప్రకటించాడు.
మెగా టోర్నీలో తొమ్మిదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది టీమిండియా. టాపార్డర్ తడబడినా మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ( 53 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్) అపద్బాంధవుడై ఆదుకున్న వేళ ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ఇండియా 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్లు సాహిబ్జదా ఫర్హాన్ (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), ఫఖర్ జమాన్ (35 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించగా.. చివరి ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కుల్దీప్ యాదవ్ (4/30), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/30), పొదుపుగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ (2/26) ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను పేకమేడలా కూల్చారు. బుమ్రా (2/25) కూడా రెండు వికెట్లతో మెరిశాడు. అనంతరం తిలక్ అద్భుత పోరాటంతో ఇండియా 19.4 ఓవర్లలో 150/5 స్కోరు చేసి గెలిచింది. శివం దూబే (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), సంజూ శాంసన్ (24) కూడా రాణించారు.
టీమిండియాకు పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అభినందన
ఆసియా కప్ గెలిచిన ఇండియాకు పీఎం నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సింధూర్. ఫలితం మాత్రం సేమ్. ఇండియా గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆసియ కప్ విజేత గా నిలిచిన టీమ్‌కు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి లో తెలంగాణ రాష్ట్రాని కి గొప్ప పేరు.. గౌరవం తెచ్చాడని కొనియాడారు.