రామ మందిరంపై పాక్‌ కామెంట్స్.. తిప్పికొట్టిన ఇండియా

రామ మందిరంపై పాక్‌ కామెంట్స్.. తిప్పికొట్టిన ఇండియా

న్యూఢిల్లీ: రామ మందిర భూమి పూజ వేడుకలపై దాయాది పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. రామ మందిరంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం దోషపూరితం అని పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ బుధవారం మండిపడింది. రామ మందిరానికి అనుకూలంగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో దేశంలో ఇవ్వాళ పెరుగుతున్న మెజారిటేరియనిజమ్‌కు అద్దం పడుతోందని విమర్శించింది. అలాగే ఇండియాలోని మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు, వారి ప్రార్థనా మందిరాలపై హెచ్చుతున్న దాడులను ఇది ప్రతిఫలిస్తోందని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను ఇండియా దీటుగా తిప్పికొట్టింది. ఇండియా అంతరంగిక వ్యవహారాల్లో పాక్ తలదూర్చొద్దని హెచ్చరించింది.

‘భారత అంతరంగివ విషయంపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఇచ్చిన ప్రెస్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించాం. దేశ అంతరంగిక వ్యవహారాలకు, మతపరమైన ఇలాంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. సరిహద్దుల్లో టెర్రరిజంకు పాల్పడటంతోపాటు తమ దేశంలోని సొంత మైనారిటీల మతపరమైన హక్కులను కాలరాసే కంట్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ చెప్పారు.