ఛీ.. ఇక మీరు మారరు: పాక్ తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం

ఛీ.. ఇక మీరు మారరు: పాక్ తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ: దిత్వా తుఫాను ధాటికి అల్లకల్లోలమైన శ్రీలంకకు మానవతా సహాయం అందిస్తున్న తమ దేశ విమానానికి ఇండియా ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. పాక్ వాదన హాస్యాస్పదమని.. భారత వ్యతిరేక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఇది మరొక ప్రయత్నమని దాయాది దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ విమానానికి కేవలం నాలుగు గంటల్లోనే అనుమతి మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది. 

శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు వెళ్లే తమ దేశ విమానానికి ఇండియా అనుమతి నిరాకరించిందని పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలు చేసింది. 60 గంటల పాటు విమానానికి గగనతల అనుమతి ఇవ్వకుండా భారత్ అడ్డుకుందని పచ్చి అబద్ధాలు ఆడింది. ఈ క్రమంలో దాయాది దేశ ఆరోపణలపై మంగళవారం (డిసెంబర్ 2) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. 

►ALSO READ | బతికే ఉన్నాడు.. కానీ: ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండిషన్‎పై సోదరి ఉజ్మా క్లారిటీ

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన హాస్యాస్పదమైన ప్రకటనను మేము తిరస్కరించాము. ఇది భారతదేశ వ్యతిరేక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మరొక ప్రయత్నం’’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ఓవర్‌ఫ్లైట్ క్లియరెన్స్ అభ్యర్థన సోమవారం (డిసెంబర్ 1) మధ్యాహ్నం 1 గంటలకు రాగా.. భారత ప్రభుత్వం అదే రోజు అనుమతి ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా సహాయం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.