ఇండియాలో ఎప్పుడూ ఏడుపులేనా.. జనంలో సంతోషం లేదా..

ఇండియాలో ఎప్పుడూ ఏడుపులేనా.. జనంలో సంతోషం లేదా..
  •     హ్యాపీనెస్​లో మళ్లీ ఫిన్లాండ్ టాప్
  •     126వ స్థానంలోనే భారత్ 
  •     వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - 2024 విడుదల 
  •     టాప్ 20 నుంచి అమెరికా, జర్మనీ ఔట్
  •     ఎప్పట్లాగే అట్టడుగున నిలిచిన అఫ్గాన్ 

న్యూయార్క్ :  ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మళ్లీ టాప్​లో నిలిచింది. ఇండియా గతేడాది లాగే ఈసారి కూడా126వ స్థానంలోనే ఉండిపోయింది. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేను పురస్కరించుకుని బుధవారం ఆఫ్ ఆక్స్​ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ మేరకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-–2024ను విడుదల చేసింది. మొత్తం 143 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. ఫిన్లాండ్ వరుసగా ఏడో ఏడాది కూడా నంబర్ 1గా నిలిచింది. 

126వ స్థానంలోనే ఇండియా

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో మన దేశం పోయిన ఏడాదిలాగే ఈ సారి కూడా126వ ర్యాంకులోనే ఉంది. మన పొరుగు దేశాలైన చైనా 60, నేపాల్ 93, పాకిస్తాన్ 108, మయన్మార్ 118, శ్రీలంక 128, బంగ్లాదేశ్ 129 స్థానాల్లో ఉన్నాయి. వయసు ఆధారంగా చూస్తే సంపన్న దేశాల్లోనే వృద్ధుల్లో జీవితంపై సంతృప్తి ఎక్కువగా ఉందని రిపోర్టు అభిప్రాయపడింది. ఇండియాలో వృద్ధులకు నాణ్యమైన జీవనం ఇంకా సరిగ్గా అందుబాటులోకి రాలేదని తెలిపింది. ప్రధానంగా ఇండియాలో వైవాహిక స్థితి, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం, కుల వివక్ష, విద్య, వైద్యం అందుబాటు వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. ఇండియాలోని వృద్ధుల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఎక్కువ సంతోషంగానే ఉన్నారని అభిప్రాయపడింది. 

 ర్యాంకులు ఇలా కేటాయించారు.. 

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కోసం143 దేశాల్లో ప్రజల స్థితిగతులను బట్టి ర్యాంకులను కేటాయించారు. ఆయా దేశాల్లో ప్రజల మధ్య సామాజిక మద్దతు, వారి ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిరహితం, జీవితం పట్ల ప్రజలు వెలిబుచ్చిన సంతృప్తి, తలసరి జీడీపీ, ఆరోగ్యకరమైన జీవితం వంటి ప్రధాన అంశాలను బట్టి హ్యాపీనెస్ స్థాయిలను అంచనా వేశారు. యూఎన్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్, గాలప్ వరల్డ్ పోల్ తో కలిసి  యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఈ మేరకు రిపోర్ట్ ను తయారు చేసింది.   

  ఫిన్లాండ్ టాప్​లో ఎందుకంటే..

ఫిన్లాండ్ ప్రజలు ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా గడపడం.. పని, జీవితం మధ్య సమతౌల్యం పాటించడం వల్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని యూనివర్సిటీ ఆఫ్​హెల్సింకీ రీసెర్చర్ జెన్నిఫర్ డీ పవోలా తెలిపారు. సక్సెస్ ఫుల్ లైఫ్ అంటే ఏమిటో వారికి బాగా తెలుసన్నారు. అదే అమెరికాలో తీసుకుంటే ఆర్థికంగా సంపాదన ఎంత పెరిగితే అంత సక్సెస్​గా భావిస్తారన్నారు. 

ఫిన్లాండ్​లో ప్రభుత్వ అధికారుల పనితీరు బాగా ఉంటుందని, అవినీతి చాలా తక్కువన్నారు. ఉచిత విద్య, వైద్యంతోపాటు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం, అధికారులు మెరుగ్గా పని చేస్తారన్నారు. అందుకే ఫిన్లాండ్​లో ప్రజలకు నమ్మకం, స్వేచ్ఛ వంటివి ఎక్కువగా ఉంటాయని, దీంతో  వారు సంతోషంగా ఉంటారన్నారు. 

 టాప్ 10 దేశాలు ఇవే..

 1. ఫిన్లాండ్,
 2. డెన్మార్క్, 
3. ఐస్ ల్యాండ్, 
4. స్వీడన్, 
5. ఇజ్రాయెల్, 
6. నెదర్లాండ్స్, 
7. నార్వే,
 8.లక్సెంబర్గ్, 
9. స్విట్జర్లాండ్, 
10. ఆస్ట్రేలియా