జీడీపీ వృద్ధి 6.9 శాతం.. డెలాయిట్ ఇండియా అంచనా

జీడీపీ వృద్ధి 6.9 శాతం..  డెలాయిట్ ఇండియా అంచనా

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ పెరగడం, ప్రభుత్వ సంస్కరణల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.7-–6.9 శాతం వృద్ధి చెందవచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-–జూన్ క్వార్టర్​లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించింది. డెలాయిట్  'ఇండియా ఎకనామిక్ ఔట్‌‌‌‌లుక్' రిపోర్ట్​ ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.9 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. ఇది మునుపటి అంచనా కంటే 0.3 శాతం పాయింట్లు ఎక్కువ.  భారతదేశం చాలా దేశాల కంటే బలంగా ఎదుగుతున్నదని చెప్పడానికి ఈ అంచనా పెంపు ఉదాహరణ అని ఎకనమిస్టులు చెబుతున్నారు.  

రాబోయే సంవత్సరంలో కూడా ఇదే తరహా వృద్ధి రేట్లను అంచనా వేసింది. వాణిజ్యం, పెట్టుబడికి సంబంధించిన అనిశ్చితుల కారణంగా మార్పులు ఉండొచ్చు. ఆర్​బీఐ అంచనాలకు అనుగుణంగా జీడీపీ వృద్ధి అంచనా ఉంది. ఆర్​బీఐ 2026 ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధిని 6.8 శాతంగా అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్​తోపాటు జీఎస్​టీ 2.0 వంటి నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా వృద్ధికి మద్దతు లభిస్తుందని డెలాయిట్ తెలిపింది. 

ధరలు తగ్గడం వల్ల కొనుగోలు శక్తిని మెరుగుపడుతుందని పేర్కొంది. డెలాయిట్  ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ మాట్లాడుతూ, పండుగల సమయంలో వినియోగ వ్యయం పెరుగుదల కారణంగా డిమాండ్‌‌‌‌కు ఊతం లభిస్తుందని అన్నారు. భారతదేశం ఈ సంవత్సరం చివరి నాటికి యూఎస్​తో, ఈయూతో వాణిజ్యం ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చని చెప్పారు.