WTT Star Contender 2025 :మానవ్‌‌–మానుష్‌‌ రన్నరప్‌‌తో సరి

WTT Star Contender 2025  :మానవ్‌‌–మానుష్‌‌  రన్నరప్‌‌తో సరి

న్యూఢిల్లీ: డబ్ల్యూటీటీ స్టార్‌‌ కంటెండర్‌‌ టోర్నీలో ఇండియన్‌‌ ప్లేయర్ల చరిత్రాత్మక పోరాటం ముగిసింది. శనివారం రాత్రి జరిగిన మెన్స్‌‌ డబుల్స్‌‌ ఫైనల్లో టాప్‌‌సీడ్‌‌ మానవ్‌‌ ఠక్కర్‌‌–మానుష్‌‌‌ షా 2–3 (3–11, 11–7, 7–11, 15–13, 5–11)తో రెండో సీడ్‌‌ బెనెడిక్ట్‌‌ డుడా–డాంగ్‌‌ క్వియు (జర్మనీ) చేతిలో ఓడి రన్నరప్‌‌తో సరిపెట్టుకున్నారు. హోరాహోరీగా సాగిన పోరాటంలో గత మ్యాచ్‌‌ పెర్ఫామెన్స్‌‌ను ఇండియన్‌‌ ప్లేయర్లు చూపెట్టలేకపోయారు. 

42 నిమిషాల పాటు జరిగిన టైటిల్‌‌ ఫైట్‌‌ ఇండియన్స్‌‌ను అనుకూలంగా సాగలేదు. జర్మనీ ప్లేయర్లు వరుసగా పాయింట్లు సాధించి ఒత్తిడి పెంచారు. దీన్ని అధిగమించే క్రమంలో మానవ్‌‌–మానుష్‌‌‌ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో ఫైనల్లోనూ దియా చితాలే–మానుష్‌‌‌ షా 2–3 (4–11, 11–8, 11–5, 5–11, 2–11)తో సతోషి ఐడా–హొనోకా హషిమోటో (జపాన్‌‌) చేతిలో కంగుతిన్నారు. 42 నిమిషాలే జరిగిన ఈ మ్యాచ్‌‌లోనూ ఇండియన్‌‌ ప్లేయర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మానవ్‌‌–మానుష్‌‌‌, దియా చితాలే–మానుష్‌‌‌ తొలిసారి డబుల్స్‌‌, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో ఫైనల్‌‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.