టారిఫ్‎లు పెంచి ట్రంప్ పెద్ద తప్పు చేశారు.. అమెరికా సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం

టారిఫ్‎లు పెంచి ట్రంప్ పెద్ద తప్పు చేశారు.. అమెరికా సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో 25 శాతం అదనపు సుంకాలు విధించడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలు అన్యాయమైనవి, అసమంజసమైనవని విమర్శించింది. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఇటీవలి రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా పని చేస్తోంది. మా దిగుమతులు మార్కెట్ కారకాలపై ఆధారపడి ఉన్నాయి. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని  రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామనే మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. తమ జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడం చాలా దురదృష్టకరం. 

ఈ చర్యలు అన్యాయమైనవి, అసమంజసమైనవి. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. అదనపు సుంకాలు విధించి ట్రంప్‌ పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అదనపు సుంకాలు విధించినా.. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి కొనసాగిస్తోందని తేల్చి చెప్పింది. 

కాగా, భారత్‎పై 24 గంటల్లో మరిన్ని అదనపు సుంకాలు విధిస్తానన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్‎పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. తొలుత 2025, జూలై 30న ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్.. 2025, ఆగస్ట్ 6న మరో 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. 

తాజా సుంకాలతో భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధించారు ట్రంప్‌. భారత్‎పై 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ బుధవారం (ఆగస్ట్ 6) కార్యనిర్వహక ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్‌. దీంతో ఇప్పటి నుంచి అమెరికాలో భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు అమలు కానున్నాయి. అమెరికా హెచ్చరించినప్పటికీ రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుండటంతోనే ఇండియాపై అదనపు సుంకాలు విధించినట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది.