
కొలంబో: ఇండియా, శ్రీలంక మధ్య వచ్చే మంగళవారం (13వ తేదీ) నుంచి మొదలవ్వాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ పోస్ట్‌పోన్ కావడం దాదాపు ఖాయమైంది. 17వ తేదీ నుంచి సిరీస్‌ను స్టార్ట్ చేయాలని లంక బోర్డు భావిస్తోంది. ఇంగ్లండ్ టూర్ పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చిన లంక జట్టులో కరోనా కలకలం రేగడమే ఇందుకు ప్రధానం కారణం. లంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, ఎనలిస్ట్ నిరోషన్ కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో జట్టు మొత్తాన్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ కారణంగానే కొంత ఆలస్యంగా సిరీస్ స్టార్ట్ చేయాలని లంక బోర్డు యోచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి ప్రతిపాదనలు కూడా పంపినట్టు సమాచారం. ‘టీమ్‌లో అందరూ కరోనా నెగెటివ్‌గా తేలారు. కానీ, బ్యాటింగ్ కోచ్, డేటా ఎనలిస్ట్ మాత్రం పాజిటివ్‌గా తేలారు. అందుకే ముందు జాగ్రత్తగా సిరీస్‌ను రీషెడ్యూల్ చేయాలని అనుకుంటున్నాం. బీసీసీఐతో చర్చించాక రీ షెడ్యూలింగ్‌పై శనివారం స్పష్టమైన ప్రకటన చేస్తాం’ అని శ్రీలంక క్రికెట్ సెక్రటరీ మోహన డిసిల్వా పేర్కొన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం 17న తొలి వన్డే, 19, 21 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 24న ప్రారంభమవుతుంది. కాగా, బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్లతో చర్చల అనంతరమే ఈ కొత్త షెడ్యూల్‌పై లంక బోర్డు ప్రకటన చేస్తుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సిరీస్ స్టార్ట్ అయితే.. 12వ తేదీన ఐసోలేషన్ పూర్తి చేసుకోనున్న లంక జట్టు కనీసం నెట్ ప్రాక్టీస్ కూడా లేకుండా బరిలోకి దిగాల్సి ఉంటుంది. మరోవైపు అనివార్య పరిస్థితి ఎదురైతే ఆల్రెడీ సిద్ధం చేసిన బ్యాకప్ టీమ్‌ను బరిలోకి దించాలని లంక బోర్డు భావిస్తోంది. ఈ జట్టు ప్రస్తుతం దంబుల్లాలో క్వారంటైన్‌లో ఉంది.