న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు ఉబెర్ కప్ నుంచి తప్పుకుంది. పారిస్ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిబ్రవరిలో బరిలోకి దిగిన సింధు వరుసగా ఆరు టోర్నీలు ఆడింది. అయితే అనుకున్న స్థాయిలో ఫామ్ చూపెట్టలేకపోయింది. దీంతో మెగా గేమ్స్‌కు పక్కాగా సిద్ధం కావాలని ఈ హైదరాబాదీ భావిస్తోంది.
విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా–గాయత్రి గోపీచంద్, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో కూడా ఉబెర్ కప్ నుంచి వైదొలిగారు. ఒలింపిక్ క్వాలిఫికేషన్ బెర్త్‌ను సాధించేందుకు ఇతర టోర్నీలపై దృష్టి పెట్టనున్నారు. సింధు, ఇతర సీనియర్ ప్లేయర్లు తప్పుకోవడంతో సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో బాగా ఆడే యంగ్ ప్లేయర్లను బరిలోకి దించాలని బాయ్ నిర్ణయం తీసుకుంది. ఇక థామస్ కప్‌లో మెన్స్ టీమ్ యధావిధిగా బరిలోకి దిగుతున్నది.
టైటిల్‌ను డిఫెండ్ చేసుకోవాలనే లక్ష్యంతో సీనియర్లందరూ అందుబాటులో ఉండనున్నారు. ప్రణయ్, లక్ష్యసేన్, శ్రీకాంత్‌తో పాటు ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్, అర్జున్, ధ్రువ్ కపిల, సాయి ప్రతీక్ బరిలో ఉన్నారు. మరోవైపు భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న సాత్విక్–చిరాగ్ జోడీ వచ్చే వారం జరగనున్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగింది.