IND vs SA: టీమిండియాకు హార్మర్ దెబ్బ.. సుదర్శన్, జడేజా పట్టుదలతో డ్రా కోసం పోరాటం

IND vs SA: టీమిండియాకు హార్మర్ దెబ్బ.. సుదర్శన్, జడేజా పట్టుదలతో డ్రా కోసం పోరాటం

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓటమిని దగ్గరైంది. ఐదో రోజు తొలి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయి డ్రా కోసం పోరాడుతోంది. సఫారీ స్పిన్నర్ హార్మర్ ధాటికి విలవిల్లాడిన భారత జట్టు ఐదో రోజు తొలి సెషన్ ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 90 పరుగులకు చేసింది. క్రీజ్ లో జడేజా (23), సాయి సుదర్శన్ (14) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 459 పరుగులు చేయాలి. రెండు సెషన్ లలో ఈ స్కోర్ కొట్టడం సాధ్యం కాకపోవడంతో ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడం కోసం కష్టపడుతోంది. రెండు సెషన్ లలో ఆలౌట్ కాకుండా మరో 60 ఓవర్లు ఆడగలిగితే మ్యాచ్ డ్రా అవుతోంది. 

2 వికెట్ల నష్టానికి 27 పరుగులతో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. నైట్ వాచ్ మెన్ కుల్దీప్ యాదవ్ ను హార్మర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే ధృవ్ జురెల్ ను పెవిలియన్ కు పంపి మరో బిగ్ షాక్ ఇచ్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా హార్మర్ ఖాతాలోకే వెళ్ళింది. దీంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జడేజాతో కలిసి సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా టీ బ్రేక్ కు వెళ్లారు. వికెట్ పడకుండా రెండో సెషన్ ఆడగలిగితే ఈ మ్యాచ్ డ్రా చేసుకోవచ్చు. 

నాలుగో రోజు ఆటలో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌‌‌‌ (13), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (6) విఫలమయ్యారు. నాలుగో రోజు 26/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 78.3 ఓవర్లలో 260/5 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (94) సెంచరీ మిస్‌‌‌‌ చేసుకోగా, టోనీ డి జోర్జి (49) రాణించాడు. జడేజా 4 వికెట్లు తీశాడు. పిచ్‌‌‌‌ బౌలర్లకు సహరిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌లో ఓటమి కోరల నుంచి ఇండియాను కాపాడటం దాదాపు అసాధ్యం. అయితే మధ్యాహ్నం 3.45 గంటల తర్వాత వెలుతురు మందగిస్తోంది. 

గత నాలుగు రోజుల్లో 80 ఓవర్లకు మించి ఆట సాధ్యం కాలేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాటర్లు క్రీజులో పాతుకుపోతే డ్రాతో గట్టెక్కొచ్చు. లేదంటే 0–2తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ తప్పదు.  తొలి ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి సెంచరీతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 489 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత మార్కో జాన్సెన్ 6 వికెట్లతో విజృంభించడంతో ఇండియా 201 పరుగులకే ఆలౌట్ అయింది.